బీఆర్ఎస్ రుణమాఫీ మిత్తిలోనే ‘మాయం’ : మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్

by M.Rajitha |
బీఆర్ఎస్ రుణమాఫీ మిత్తిలోనే ‘మాయం’ : మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ రుణమాఫీ మిత్తిలోనే మాయం అయిందని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ..2014, 2018 లో రెండు సార్లు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీఆర్ఎస్, ఫస్ట్ టర్మ్ లో మొక్కుబడిగా రుణమాఫీకి నిధులు విడుదల చేయగా, అవి కేవలం రైతులు తీసుకున్న లోన్ ఇంట్రస్ట్ లకే సరిపోయాయన్నారు. 2014 లో బీఆర్ఎస్ రూ.16 వేల కోట్లను నాలుగు దఫాలుగా ఐదేళ్ల కాలంలో చేయగా, మిత్తిలకే సరిపోయాయని గుర్తు చేశారు. అందుకే తాజాగా సిరిసిల్లలో ఓ రైతు బీఆర్ఎస్ దొంగ ఆందోళనకు సరైన విధానంలో బుద్ది చెప్పిండని వెల్లడించారు. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ దొంగ డ్రామాలు ఆడిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఏదో కొర్రీలు పెడుతుందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. టెక్నికల్ గా కొంత మందికి రాలేదనే విషయం ప్రభుత్వం దృష్టిలో ఉన్నదని, ఫిర్యాదుల కొరకు కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని, సమస్య త్వరలోనే పరిష్కరించబడుతుందన్నారు. కానీ కేటీఆర్ కండ్లు నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రుణమాఫీ జరగలేదని, ఇచ్చిన మాట తప్పిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. సోషల్ మీడియా ప్రచారాల కోసం సొంత మనుషులతో రోడ్లపైకి ఎక్కించి, బీఆర్ఎస్ డ్రామాలకు పాల్పడుతుందన్నారు. దమ్ముంటే పదేళ్ల కాలంలో ఎంత మందికి రుణమాఫీ చేశారో? బీఆర్ఎస్ స్పష్టమైన లెక్కలతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలలో కాలంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తూనే, రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ది అని కొనియాడారు. జులై 18 నుండి మొదలుపెడితే, ఆగస్ట్ 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. నెల రోజుల కాల వ్యవధిలోనే పూర్తి చేశామన్నారు. రైతులు పండగ చేసుకుంటే, బీఆర్ఎస్ నాయకులు పెయిడ్ నిరసనలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ మాటలు కేటీఆర్ నోటి నుండి వస్తున్నాయని, ఇన్ని రోజులు బీజేపీ మాత్రమే రాజీవ్ గాంధీని వ్యతిరేకించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ దానికి జత కట్టిందని గుర్తు చేశారు. బీజేపీ మెప్పు పొందెందుకే కేటీఆర్ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ చరిత్ర గొప్పదని గతంలో స్వయంగా కేసీఆర్ అన్నాడని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం తీసేద్దామనుకునే లోపు ప్రజలు బీఆర్ఎస్ కి ఘోరి కడతారని హెచ్చరించారు.

Next Story

Most Viewed