'లీకేజీ కేసులో గూడుపుఠాణి.. టీఎస్‌పీఎస్సీ సభ్యుడి రాజీనామా!'

by Mahesh |
లీకేజీ కేసులో గూడుపుఠాణి.. టీఎస్‌పీఎస్సీ సభ్యుడి రాజీనామా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో గూడుపుఠాణి జరుగుతోందని, ఓ వైపు ప్రశ్నపత్రాల వ్యవహారంపై తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంటే ఎవరికీ తెలియకుండా కమిషన్ సభ్యుడు ఆరవెల్లి చంద్రశేఖర్ రావు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్‌లో చాలా మంది బయోడేటాలు తారుమారవుతున్నాయన్నారు. మంగళవారం ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన 'నిరుద్యోగుల గోస అఖిలపక్ష భరోసా' నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీఎస్ పీఎస్సీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న 13 మంది ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపించారు.

వందల కోట్ల విలువ కలిగిన టీఎస్‌పీఎస్సీ కుంభకోణంలో అరెస్ట్ అయిన వారు చిన్నవాళ్లని అసలైన సూత్రదారులు సీఎం ఆఫీస్‌లో, బీఆర్ఎస్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే ఈ కేసు దర్యాప్తు సక్రమంగా జరగడం లేదన్నారు. గ్రూప్ -1 టాపర్స్ మొబైల్ ఫోన్లతో పాటు సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఉద్యోగుల ఫోన్లను తీసుకుని పరిశీలిస్తే 2 నిమిషాల్లో అసలు దొంగలెవరో దొరుకుతార్నారు. 36 లక్షల నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ కేసులో పోలీసులు రాజ్యాంగ బద్దంగా పని చేసినట్లైతే కేసీఆర్‌కు భయపడాల్సిన పని లేదని, తెలంగాణకు నిజాలేంటో చెప్పాలన్నారు. నిజాయతీ గల పోలీసులను తెలంగాణ గుండెల్లో పెట్టుకుంటుందన్నారు.

పదో తరగతి పేపర్ లీకేజీలో 48 గంటల్లో పాత్రధారులు, సూత్రదారులను పట్టుకున్నారని, వరంగల్ కమిషనర్ మూడు సార్లు ప్రెస్ మీట్ పెట్టి నిందితుడిని నిర్ణయించారని, కానీ టీఎస్ పీఎస్సీ కేసులో ఏర్పాటైన సిట్ నుంచి ఇవాళ్టికి ఒక్క అధికారి కూడా మీడియా ముందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ మాత్రం మీడియా ముందుకు వచ్చి ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలే దోషులుగా ప్రకటించి కేసును చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారన్నారు.

రేణుకకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం బయటకు రాకపోయి ఉంటే కమిషన్‌లో మరో 30 ఏళ్లు పేపర్లు లీకేజీ అయి ఉండేవని, ప్రవీణ్ కుమార్ కు సంబంధించిన ఓఎంఆర్ షీట్ గనుక బయటకు రాకుండా ఉండి ఉంటే గ్రూప్ 1 మెయిన్స్ యథావిధిగా నిర్వహించేవారని అన్నారు. నెలకు నాలుగు లక్షల 25 వేల జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మేము అడిగిన 25 ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. కేసీఆర్ ప్రగతి భవన్ లో ఏసీలో కూర్చుంటే నిరుద్యోగ తెలంగాణ ఇవాళ ఎర్రటి ఎండలో కూర్చుందని అన్నారు.

Advertisement

Next Story