ఫ్యాక్షన్ జూపల్లికి వెన్నతో పెట్టిన విద్య.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు

by Rajesh |   ( Updated:2024-05-25 08:15:01.0  )
ఫ్యాక్షన్ జూపల్లికి వెన్నతో పెట్టిన విద్య.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో కొల్లాపూర్ నియోజకవర్గంలో పెట్రేగి పోతున్నారని మండిపడ్డారు. అక్కడ జరుగుతున్న అక్రమాలు, బెదిరింపుల‌పై వివరాలతో సహా తెలంగాణ డీజీపీని కలిసి వివరించామన్నారు.

తాము చెప్పిన కొన్ని గంటలకే శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. జూపల్లి కృష్ణారావే హత్య చెపించాడని శ్రీధర్ రెడ్డి తల్లి దండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారని గుర్తు చేశారు. జూపల్లి కృష్ణారావు పేరును FIR లో నమోదు చెయ్యలేదని, ఇంత వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని సీరియస్ అయ్యారు. జూపల్లి కృష్ణారావు మంత్రి అయిన తరువాత కొల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ పడగెత్తిందన్నారు. హోం శాఖ సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉందని.. సీఎం మాత్రం వరుస ఘటనలపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

గ్రామాల్లో శాంతి భద్రతలు బాగుండాలంటే కాంప్రమైజ్ చేయాలని పోలీసులు చెప్తున్నారని తెలిపారు. ఫ్యాక్షన్ నడపడం జూపల్లి కృష్ణారావుకీ వెన్నతో పెట్టిన విద్య అన్నారు. బుడోజర్ల సంస్కృతిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మంత్రి జూపల్లి కృష్ణారావు అని ఆరోపించారు. నిందితులకి స్టేషన్ బెయిల్ ఇప్పిస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదని ఫేక్ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. అంతా చేసి తనకు ఫ్యాక్షన్ సంస్కృతి తెలియదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని జూపల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయడం కోసం ఢిల్లీలో ఉండి నీరుగార్చిన వ్యక్తి జూపల్లి అని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ సంస్కృతిని పారదోలాలంటే వెంటనే కొల్లాపూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో పికెటింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పాలమూరులో కేసీఆర్ నీళ్లు పారిస్తే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు రక్తపుటేరులు పారిస్తున్నారన్నారు.

Advertisement

Next Story

Most Viewed