Y S Sharmila: అధికారంలోకి వస్తే ఇంట్లో అర్హులందరికీ రూ.3 వేల పెన్షన్లు!

by Nagaya |   ( Updated:2022-09-08 18:14:55.0  )
Y S Sharmila: అధికారంలోకి వస్తే ఇంట్లో అర్హులందరికీ రూ.3 వేల పెన్షన్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగారు తెలంగాణ అని చెప్పి సీఎం కేసీఆర్ పేదవాళ్లకు బతుకు లేకుండా చేశారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం బాగుపడలేదని, ఆయన కుటుంబ సభ్యులే బాగుపడ్డారని మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం వనపర్తి జిల్లా గోపాలపేట మండలం పోల్కెపహాడ్‌లో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు, రైతులు, మహిళలు, ముస్లిం మైనార్టీ వర్గాలతో పాటు ఓ ఒక్కరూ సంతోషంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుడులు, బడుల కంటే బార్లు, బెల్ట్ షాపులే ఎక్కువ ఉన్నాయని ఆరోపించారు. ఎవరికి కోసం తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలైందని ప్రశ్నించారు. కేసీఆర్ తన పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుంటుంబం మీద నాలుగు లక్షల రూపాయల అప్పు మోపాడని ఆరోపించారు.

ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తారని ఈ సారైనా ఓటు వేసే ముందు ఆలోచించాలని అన్నారు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి.. కానీ ఎవరికి ఓటు వేస్తున్నామో ఆలోచించాలని సూచించారు. ఈ సారి టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మీ బిడ్డలు కూడా మిమ్మల్ని క్షమించరని అన్నారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి చివరి శ్వాస వరకు ప్రజల కోసమే తపించారని అన్నారు. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి రాజ్యాన్ని తీసుకువచ్చేందుకే తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తుందని, ఆ పార్టీకి ఓట్లు వేస్తే తిరిగి వారంతా టీఆర్ఎస్‌లోనే చేరుతున్నారని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, విభజన చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఇస్తే రాష్ట్ర యువకులకు ఉద్యోగాలు వచ్చేవి కాదా అని ప్రశ్నించారు.

ఇన్నాళ్లు ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు సరైన రీతిలో ప్రశ్నించలేదని అందువల్లే తాను పాదయాత్ర చేస్తున్నాన్నారు. నన్ను మీరంతా ఆశీర్వదిస్తే రాజశేఖర్ అమలు చేసిన సంక్షేమ పాలన అందిస్తానని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది అర్హులు అంటే వారందరికీ రూ.3000 తగ్గకుండా పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిల ఇస్తున్న హామీ అని అన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ ను పూర్తి స్థాయిలో అమలు, కార్పొరేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లోన్లు, రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ, పంటలకు మద్దతు ధర, నష్టపరిహారం, రైతు బీమా, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. గతంలో రాజశేఖర్ రెడ్డి పాలనలో అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed