KTR : రేవంత్ రెడ్డివి అక్కరకురాని చిట్ చాట్లు : కేటీఆర్

by M.Rajitha |   ( Updated:2025-02-26 15:23:55.0  )
KTR : రేవంత్ రెడ్డివి అక్కరకురాని చిట్ చాట్లు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాటల దాడికి దిగారు. ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC) నిర్మాణంపై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని మండిపడ్డారు. అంతపెద్ద ప్రమాదం జరిగితే.. ఒక బాధ్యతగల ముఖ్యమంత్రివి అయితే రెస్క్యూ ఆపరేషన్(SLBC Tunnel Rescue Operation) మీద దృష్ఠి పెట్టేవాడివని.. బాధ్యత లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు, ఢిల్లీ టూర్లు అంటూ తిరిగే మీకు పాలన అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు. SLBC ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్(KCR) ఎప్పుడో చెప్పారని ఆయన వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ కాలం గడపడం కాదని, కేసీఆర్ వివరించిన ఆ వీడియో చూస్తే కొంచం అయినా విషయ పరిజ్ఞానం వస్తుందని ఎద్దేవా చేశారు.

అయినా పనులు ఆగిపోవడం వల్ల బేరింగులు పనిచెయ్యడం లేదు అని అనడం ఏమిటని.. అసలు పనులు మొదలు పెట్టడానికి ముందు టెక్నికల్ అసెస్మెంట్, GSI survey ఏమన్నా చేశారా? లేక గుడ్డిగా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా? అని నిలదీశారు. టన్నెల్ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తే దాని గురించి మాట్లాడడం మానేసి, పనికిమాలిన లీకులు, అక్కరకు రాని చిట్ చాట్లు దేనికి? కేటీఆర్ మండిపడ్డారు. కాగా నేడు ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ(PM Narendra Modi)తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ అధికారిక నివాసంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ముఖ్యమంత్రి ప్రధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఎస్ఎల్బీసీ పాపం కేసీఆర్ దే అని, పదేళ్ల నుంచి ఎలాంటి పనులు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో 30 కిలోమీటర్లు టన్నెల్‌ పూర్తైందని, మధ్యలో ఏ పనులు చేయకపోవడం వల్లే మెషీన్‌ బేరింగ్స్‌ పాడయ్యాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కు ఈ ప్రాజెక్టులో ఏం లాభం లేదనే పనులు పక్కకు పెట్టారని, మెషీన్స్ అన్నీ తుప్పు పట్టి పోయి ఉండటం వలనే ఈ ఘోరం జరిగిందన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా రేవంత్ రెడ్డిపై మాటల యుద్ధానికి దిగారు.

Next Story

Most Viewed