సీఎం కేసీఆర్‌కు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

by Satheesh |   ( Updated:2023-09-06 12:24:46.0  )
సీఎం కేసీఆర్‌కు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజున జీతం పడుతుందో కూడా తెలియని దుస్థితి ఏర్పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఐదారు నెలలుగా కాంట్రాక్ట్ లెక్చరర్స్‌కు జీతాలు పెండింగ్‌లో ఉంచారని.. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాల చెల్లింపుల అంశంపై బుధవారం సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు, కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని 2014 బీఆర్ఎస్ హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అతీగతీ లేదని మండిపడ్డారు.

మే నెలలో రెగ్యులర్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లకు ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు ఇప్పటి వరకు లేవన్నారు. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లకు కొన్ని జిల్లాలో ఇంకా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎంకు రేవంత్ మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల పెండింగ్ జీతాలు చెల్లింపు, వీరికి ప్రతి నెల సకాలంలో జీతాల చెల్లింపు, వివిధ కారణాలతో రెగ్యులరైజ్ చేయని వారిని తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారి తరపున కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ప్రత్యక్ష కార్యచరణకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.

Advertisement

Next Story