మరోసారి రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-02 07:22:30.0  )
మరోసారి రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మరోసారి పంచాయితీ ముదిరిందా? ఇటీవల నల్గొండలో తనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన అంశంపై వెంకట్ రెడ్డి గుర్రుగా ఉన్నారా? తాజాగా ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పోస్టర్ల వెనుక రేవంత్ రెడ్డినే ఉన్నారని ఆరోపిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

బడ్జెట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన కోమటిరెడ్డి ముగ్గురు నేతలతో విడివిడిగా భేటీ అయి నకిరేకల్‌లో తనకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్ల అంశంపై కంప్లయింట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా గత కొంత కాలంగా రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డికి మధ్య పార్టీలో కోల్డ్ వార్ జరుగుతుండగా ఇటీవల కొత్త ఇన్ ఛార్జి మాణిక్ రావు థాక్రే రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఈ ఇద్దరు భేటీ అయి అందరిని ఆశ్చర్య పరిచారు. అనూహ్యంగా వీరిద్దరు కలిసిపోవడంతో ఇక ముందు కూడా ఐక్యమత్యంగా కలిసి పని చేయబోతున్నట్లు హస్తం పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది.

కానీ ఇంతలోనే తనను కోవర్ట్ అని ముద్ర వేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోస్టర్లు వెలవడం వెంకట్ రెడ్డికి ఆగ్రహం తెప్పించాయని ఈ చర్య వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడనే అనుమానంతో పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయగా దీనిపై రేవంత్‌తో మాట్లాడుతామని ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ అంశంలో ప్రచారం ఇలా ఉంటే వాస్తవాలు ఏంటి అనేది ఇరువురు నేతలు క్లారిటీ ఇస్తేనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లేకపోతే గత అనుభవాల దృష్ట్యా మరోసారి ఈ ఇద్దరి విషయంలో ప్రచారాలు జోరందుకుంటాయని దీని వల్ల తిరిగి పార్టీకి నష్టం తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed