- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పది రోజుల టూర్‌కు బయలుదేరిన రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పది రోజుల అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటన కోసం శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరై సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా పలు కంపెనీలతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి పెట్టుబడులే లక్ష్యంగా వెళ్ళారు. పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సోమవారం బయలుదేరి వెళ్ళనున్నారు. తొలుత అమెరికాలో పర్యటించనున్న సీఎం బృందం... న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నది.
సీఎం వెంట చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంఓ అధికారి అజిత్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. న్యూయార్క్ నగరంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓతో ఈ నెల 5న (సోమవారం) సీఎం బృందం సమావేశం కానున్నది. దానికి కొనసాగింపుగా అదే నగరంలో టీబీసీ, కార్నింగ్, జోయిటస్, ఆర్‌సీఎం తదితర కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశం జరగనున్నది. ఆర్గా సీఈఓ రామకృష్ణ, పీ అండ్ ఓ సంస్థ సీఓఓ శైలేష్ జెజుర్కర్‌తోనూ మీటింగ్ జరగనున్నది. పెప్సీ కంపెనీ, హెచ్‌సీఏ ప్రతినిధులతో మంగళవా, సమావేశమైన తర్వాత వాషింగ్టన్ చేరుకుని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం జరగనున్నది. హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ తదితర ప్రాజెక్టులపై చర్చించి ఆర్థిక సాయాన్ని కోరే అవకాశమున్నది.
అదే రోజున డల్లాస్‌లో కొన్ని కంపెనీల ప్రతినిధులో సమావేశమయ్యే సీఎం రేవంత్... మరుసటి రోజున మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శిస్తారు. అనంతరం ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ హెడ్, ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మరుసటిరోజున కాలిఫోర్నియాలోని ట్రినెట్ సీఈఓతో పాటు అమెజాన్, రెనెశాస్, అమాట్, ఆరమ్ తదితర సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. సెమీ కండక్టర్ పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పాలని భావిస్తున్న సీఎం రేవంత్... ఇటీవల ఢిల్లీలో పర్యటించినప్పుడు ప్రధాని మోడీకి స్పెషల్ రిక్వెస్టు చేసి అన్ని రకాల సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఇప్పుడు అమెరికా టూర్ సందర్భంగా సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పలువురితో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. గూగుల్ కంపెనీకి చెందిన పలువురితో ఈ నెల 9న జరిగే సమావేశంతో అమెరికా టూర్ ముగుస్తుంది.
అమెరికా టూర్ ముగిసిన తర్వాత ఈ నెల 10న నేరుగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ వెళ్ళి కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్స్, హ్యుండయ్ మోటార్స్ సహా పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరి అనువైన వాతావరణం గురించి వివరిస్తారు. కొరియాకు చెందిన ఎల్జీ, శామ్‌సంగ్ సంస్థల ప్రతినిధులు పాల్గొనే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం బృందం పాల్గొంటుంది. అక్కడి హాన్ రివర్ ప్రాజెక్టు గురించి డిప్యూటీ మేయర్‌తో సమావేశమైన తర్వాత తిరుగు ప్రయాణంలో సింగపూర్‌లో కొన్ని మీటింగుల్లో పాల్గొని ఈ నెల 14న హైదరాబాద్ చేరుకోనున్నది. మొత్తం 11 రోజుల పర్యటనలో వారం పాటు అమెరికాలో మూడు రోజుల పాటు కొరియాలో పర్యటించి ఒక రోజు సింగపూర్‌లో గడపనున్నది.