- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తెలంగాణలోనూ ‘కర్ణాటక పాలసీ’.. ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్వోఆర్-2024 ముసాయిదా కోసం రాష్ట్ర ప్రభుత్వం 18 రాష్ట్రాల విధి విధానాలను పరిశీలించింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇంకేమైనా మార్పులు చేస్తే మెరుగైన సేవలు అందించడం వీలవుతుందేమోనని స్టడీ చేస్తున్నది. అందులో భాగంగా కర్ణాటక పాలసీ మీద ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. రికార్డుల కంప్యూటీకరణలో కర్ణాటక అనుసరించిన విధానం దేశంలోనే బెస్ట్ గా నిలిచింది. ప్రభుత్వమే వీటిని ఆపరేట్ చేస్తూ డేటాను భద్రం చేస్తుండగా, సాంకేతిక సమస్యల పరిష్కారానికి 50 మందితో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నది. అంతేకాకుండా దిశాంక్ యాప్ ను రూపొందించి ల్యాండ్ వివరాలన్నీ కనిపించేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ల్యాండ్ హిస్టరీ మొత్తం కనిపించేలా లింక్ డాక్యుమెంట్లను సైతం జత చేస్తున్నారు. దీని ద్వారా భూమికి సంబంధించి ఏ డాక్యుమెంటైనా డౌన్ లోడ్ చేసుకునే వీలు కలుగుతుంది. ఓ వైపు మాన్యువల్ రికార్డులు నిర్వహిస్తూనే డిజిటలైజేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. అలాంటి భూ పరిపాలన విధానాన్ని పరిశీలించి తెలంగాణ ఆర్వోఆర్-2024 డ్రాఫ్ట్ లో ఇంకేమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదేమోనని ఇటీవల భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్, ప్రస్తుత అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిలు రాష్ట్ర రెవెన్యూ మంత్రి, కమిషనర్ లతో సుదీర్ఘంగా చర్చించారు.
కోటికి పైగా భూ ఆధార్ నంబర్లు
భూ ఆధార్ (యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ – యూఎల్ పిన్) అమలులో కర్ణాటక ముందుంది. తెలంగాణలోనూ భుదార్ ను అమలు చేసేందుకు కొత్త ఆర్వోఆర్ ముసాయిదాలో చేర్చారు. దీనిపై కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ లీగల్ సాంటిటీ ఉండేందుకు చట్టంలో చేర్చడం ద్వారా రైతులకు మేలు కలిగిస్తుందని కర్ణాటక అధికారులు ధ్రువీకరిస్తున్నారు. మరో ఏడాదికైనా ప్రతి భూ కమతానికి యూనిక్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్రం తప్పనిసరి చేసిన విషయాన్ని సీనియర్, రిటైర్డ్ అధికారులు గుర్తించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో 2 కోట్ల దాకా ల్యాండ్ పార్శిల్స్ ఉంటే, ఇప్పటికే 1.10 కోట్లకు భూ ఆధార్ నంబర్ జనరేట్ చేశారు. ఈ యూఎల్ పిన్ నంబర్ కి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడినది జత చేయడం ద్వారా వివాదాల్లేని భూ కమతాలుగా మారుతున్నాయి.
మ్యాప్ తో తగ్గిన వివాదాలు
ప్రతి లావాదేవీకి హద్దులతోపాటు మ్యాప్ తప్పనిసరి అంటూ ఆర్వోఆర్-2024 ముసాయిదాలో పేర్కొన్నారు. దీని ద్వారా కొత్త వివాదాలకు ఆజ్యం పోసినట్లవుతుందని కొందరు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయితే దీనినే కర్ణాటకలో అమలు చేసినప్పుడు తొలుత కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కానీ ఒక్కొక్కటిగా లావాదేవీలు చోటు చేసుకున్నప్పుడల్లా ఆ కమతం పూర్తి వివాదరహితంగా మారుతున్నది. దీంతో టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమలు చేసేందుకు ఫ్యూచర్ లో దోహదపడుతుందని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. సరిహద్దులతోపాటు మ్యాప్ ఉండడం వల్ల కొనుగోలుదారులకు కూడా ఈజీ అవుతుంది. ఈ విషయాన్ని కర్ణాటక పక్కనే ఉన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వనపర్తిలో చట్టంపై నిర్వహించిన సదస్సులో ప్రస్తావించారు. ప్రతి కమతానికి మ్యాప్ ఉంటే దాని విలువ కూడా పెరుగుతుంది. అయితే అక్కడ కూడా లైసెన్స్ డ్ సర్వేయర్లతోనే చేయిస్తున్నారు. తొలినాళ్లలో మ్యాప్ మ్యాచ్ చేయడం కష్టమే. కానీ జియో ట్యాగింగ్ చేసుకుంటూ వెళ్తే కొన్నాళ్లకు గాడిలో పడుతుంది. యజమాని సర్వే చేయించుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి సమస్యా తలెత్తదు. ఇరుగుపొరుగు సర్దుకుపోయేందుకు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.
రికార్డుల ఆధునీకరణకు 20 ఏండ్లు
కర్నాటకలో రికార్డుల ఆధునీకరణకు 20 ఏండ్లు పట్టింది. అయితే తెలంగాణలో 2017లో రికార్డుల ప్రక్షాళన తక్కువ సమయంలోనే పూర్తి చేయడంతో 20 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. మరో 20 లక్షల మంది తమ డేటా సరిగ్గా లేదంటూ గగ్గోలు పెట్టారు. పొరపాట్లు, తప్పుల సవరణకు సరైన మెకానిజం లేకుండా చేశారనే విమర్శలు వచ్చాయి. రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేయడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోయాయి. కర్ణాటకలో మాత్రం ఇప్పటికీ తహశీల్దార్ నుంచి ల్యాండ్ కమిషనర్ స్థాయి వరకు అధికారాలను కట్టబెట్టారు.
కోర్టు కేసు ఉంటే..
తెలంగాణలో రెవెన్యూ కోర్టులే రద్దు చేశారు. ప్రతి అంశానికి సివిల్ కోర్టుకే వెళ్లాలంటూ బాధితులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అదే కర్ణాటకలో రెవెన్యూ కోర్టులను కొనసాగిస్తున్నారు. సివిల్ కోర్టులో నడుస్తున్న కేసుల వివరాలను కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు వీలు కల్పించారు. ఏయే సర్వే నంబరులో ఎవరెవరి మధ్య కేసులు ఉన్నాయి? కేసు హియరింగ్ డేట్ ఎప్పుడు? అనేది కూడా పబ్లిక్ డొమెయిన్ లో పెడుతున్నారు. దీని ద్వారా వివాదాలు కూడా ముందే తెలిసిపోతున్నాయి. రెవెన్యూ కేసులను నిరంతర ప్రక్రియగా భావిస్తున్నట్లు కర్ణాటక ల్యాండ్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ తెలిపారు.
ఎవరి స్థాయిలో ఎన్ని రోజులు?
రికార్డుల సవరణ, కేసుల పరిష్కారం ఏ అధికారి దగ్గర ఎన్ని రోజుల్లో చేయాలన్న దానిపై క్లారిటీ ఉంది. తహశీల్దార్ 90 రోజులు, ఆర్డీవో 6 నెలలు, కలెక్టర్ సంవత్సరం కాలంలో కేసులను తప్పనిసరిగా పరిష్కరించాలి. అయితే సగటు కాలం తహశీల్దార్ దగ్గర 92 రోజులు, ఆర్డీవో దగ్గర సంవత్సరం, కలెక్టర్ దగ్గర ఏడాదిన్నరగా నమోదైంది. దీన్ని సగానికి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
ప్రత్యేక టీమ్స్ తోనే..
తెలంగాణలో ధరణి పోర్టల్ నిర్వహణను ఓ దివాళా తీసిన కంపెనీకి అప్పగించారన్న విమర్శలు వచ్చాయి. ప్రైవేటు సంస్థకు అత్యంత విలువైన డేటాను అప్పగించడం పట్ల కొత్త ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. అదే కర్ణాటకలో 50 మంది టీమ్ తో వ్యవస్థను నడిపిస్తున్నారు. ఈ టీమ్ తోనే సాంకేతిక సమస్యలను అధిగమిస్తున్నారు. పౌర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. తెలంగాణలోనూ ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.