రిటైర్డ్..నాట్ అవుట్! మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లకు కీలక బాధ్యతలు

by Sathputhe Rajesh |
రిటైర్డ్..నాట్ అవుట్! మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లకు కీలక బాధ్యతలు
X

సర్వీస్‌లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌ల కంటే రిటైర్డ్ ఆఫీసర్లకే తెలంగాణ ప్రభుత్వం ప్రియారిటీ ఇస్తున్నది. ఉద్యోగ విరమణ చేసిన వెంటనే కొద్ది మందిని కీలక శాఖల్లో తిరిగి నియమిస్తున్నది. ఇలా ఒకరో ఇద్దరో అయితే సెక్రటేరియట్‌లో పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ ఏకంగా అరడజను మంది ఆఫీసర్లను అందలమెక్కించడంపై అధికారుల్లోనే చర్చకు తావిచ్చింది.

సర్వీసులో ఉన్న ఆఫీసర్లకు తగిన అవకాశాలు ఇవ్వకుండా రిటైర్డ్ పర్సన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇష్టమున్న ఆఫీసర్లు రిటైర్డ్ కాగానే కొందరిని సలహాదారులుగా, మరికొందరిని వివిధ శాఖల్లో ఇప్పటికే నిర్వహించిన బాధ్యతలను తిరిగి కట్టబెట్టడం రాష్ట్ర అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పాలనలో కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయం మొదలు శాఖల వరకూ రిటైర్డ్ అయిన వారిని కీలక పదవులు కట్టబెట్టడం ట్రెండ్‌గా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి వ్యవహారాలను చక్కదిద్దే ముఖ్య కార్యదర్శి సైతం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరే. సీఎంఓలో ఎవరిని సెక్రటరీలుగా నియమించుకోవాలి.. ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి..

తదితర అంశాల్లో పూర్తి స్వేచ్ఛ ముఖ్యమంత్రిదే. కానీ సర్వీసులో ఉన్న వారిని కాకుండా రిటైర్డ్ ఆఫీసర్లను నియమించుకోవడమే చర్చకు తావిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఇది ఓ సాంప్రదాయంగా మారిందని విమర్శలు ఉండనే ఉన్నాయి. సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నర్సింగ్ రావు 1986 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో కోల్ ఇండియా సీఎండీగా పని చేసి 2018లో రిటైర్డ్ కావాల్సి ఉన్నా తెలంగాణ ఏర్పడడంతో 2014లోనే రాజీనామా చేశారు. వెంటనే కేసీఆర్ అవకాశం కల్పించారు.

సీఎంఓలో మరో సెక్రటరీగా భూపాల్‌రెడ్డి 1991 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. 2012లోనే రిటైర్డ్ అయినా కేసీఆర్ ఆయన్ను కార్యదర్శిగా నియమించుకున్నారు. మరో కార్యదర్శిగా ఉన్న రాజశేఖరరెడ్డి కేంద్ర సివిల్ సర్వీసెస్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ యూపీఏ హయాంలో కేసీఆర్ కేబినెట్ మంత్రిగా పనిచేసే సమయంలో తన కింది అధికారిగా ఉండడంతో తెలంగాణ సీఎం అయిన తర్వాత ఆయన్ను కార్యదర్శిగా నియమించుకున్నారు.

ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకుని ప్రస్తుతం సీఎంవో సెక్రటరీగా కొనసాగుతున్నారు. సీఎంవోలో కీలకమైన శాఖల బాధ్యతలు కూడా వీరివే. సర్వీసులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లకు పెద్దగా ప్రయారిటీ లేదనే చర్చ అధికారవర్గాల్లో చోటు చేసుకున్నది. సెక్రటేరియట్‌లోనూ ఇదే టాపిక్‌ నడుస్తున్నది. ఫైనాన్స్, సివిల్ సప్లైస్, జీఏడీ, పశుసంవర్థక శాఖల్లో రిటైర్డ్ అధికారులను తిరిగి అదే హోదాలో బాధ్యతలను అప్పగించింది.

కేడర్ లేదనే కారణంతో..

రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం పది జిల్లాలను 33 జిల్లాలుగా చేసింది. అందుకు తగ్గట్టుగా సివిల్ సర్వెంట్స్ క్యాడర్ (ఐఏఎస్) పెంచాలని పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ ఆశించిన తీరులో సానుకూల స్పందన రాలేదు. అదే సమయంలో రాష్ట్రంలో పని చేస్తున్న చాలా మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టిందనే విమర్శలున్నాయి. కొందరి పోస్టింగుల విషయంలో ప్రాధాన్యత లేని శాఖల్లో నియమించిందనే అసంతృప్తి ఉన్నది.

తగిన అనుభవం, పని నైపుణ్యం, సంతృప్తికరమైన ట్రాక్ రికార్డు ఉన్నా కొన్ని సందర్భాల్లో ఉన్నత స్థాయిలో పోస్టింగు పొందడానికి అడ్డంకిగా మారిందనే ఆవేదనా పలువురిలో వ్యక్తమవుతున్నది. రాష్ట్ర అవసరాలకు తగినంత సంఖ్యలో ఐఏఎస్ అధికారులు లేనందువల్లనే ఒకరికి రెండు, మూడు శాఖల బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుందన్న వాదనను ప్రభుత్వం గతంలో వ్యక్తం చేసింది. ఆ కొరతను తీర్చుకోడానికే రిటైర్డ్ పర్సన్స్‌ను కంటిన్యూ చేయాల్సి వస్తున్నదనే కారణాన్ని పలువురు సీనియర్లు తెరపైకి తెస్తున్నారు.

జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ)లో రిటైర్డ్ అయిన అర్వీందర్‌సింగ్‌కు అదే శాఖలో ప్రొటోకాల్ విభాగంలో అదనపు కార్యదర్శిగా కేసీఆర్ అవకాశం కల్పించారు. గతంలో ఆర్థిక శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన శివశంకర్‌ను అదే శాఖలో కన్సల్టెంట్‌గా నియమించుకున్నారు. ఇండియన్ ఎకానమీ సర్వీస్ అధికారిగా రిటైర్డ్ అయిన జీఆర్ రెడ్డికి ఫైనాన్షియల్ సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు.

వాణిజ్యపన్నుల శాఖలో రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్‌ను రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖలో కమిషనర్ (ఎక్స్ అఫీషియో)గా నియమించారు. పశు సంవర్ధక శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన అదర్ సిన్హాను తిరిగి అదే శాఖలో అదే హోదాలో కంటిన్యూ చేశారు. ఏ హోదాలో రిటైర్డ్ అయితే అదే హోదాలో కంటిన్యూ అయ్యేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు. కొద్దిమంది ఆఫీసర్లకు రిటైర్డ్ అయిన వివిధ శాఖల్లో కొనసాగేలా ఎక్స్‌టెన్షన్ అవకాశాలు వస్తున్నా ఈ కారణంగా సీనియారిటీ, టాలెంట్ ఉన్న అధికారులకు తగిన అవకాశాలు రావడంలేదనే చర్చలు జరుగుతున్నాయి.

తప్పు చేస్తే బాధ్యత ఎవరిది?

రిటైర్డ్ అధికారులను తిరిగి సర్వీసులోకి తీసుకోవడం వల్ల పాలనపై అంతగా ఎఫెక్ట్ ఉండదని అభిప్రాయాలు వినిపిస్తున్నా సర్వీసులో ఉన్న కాలంలో వీరు ఏదైనా పొరపాట్లు చేస్తే అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అధికారులకు బదులుగా సర్వీసులో ఉన్నవారిని నియమించుకుని రిస్క్ తగ్గించుకోవచ్చు గదా అనే గుసగుసలు అధికారుల మధ్యలో చోటుచేసుకున్నాయి.

నిర్దిష్టంగా ఒక శాఖలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సర్వీసులో ఉన్న అధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారని, రికార్డుల్లో రిమార్కులు పడతాయనే భయం ఉంటుందని, కానీ రిటైర్డ్ అధికారులకు అలాంటి భయాలు ఎందుకుంటాయన్నది ఆఫీసర్ల వాదన. రిటైర్డ్ అధికారులకు కేసీఆర్ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారనేది సర్వీసులో ఉన్న అధికారులకు మింగుడుపడని అంశంగా మారింది.

నచ్చిన వారికి అడ్వైజర్ పదవులు

ఉద్యోగ విరమణ పొందిన అధికారులందరికీ సీఎం కేసీఆర్ రీ–అపాయింట్‌మెంట్ రూపంలో అవకాశం ఇవ్వడంలేదు. సలహాదారులుగానూ పెట్టుకోవడంలేదు. ఆయనకు నచ్చిన వారికే అవకాశాలు లభిస్తున్నాయి. ఈ మధ్య డీజీపీగా రిటైర్డ్ అయిన మహేందర్ రెడ్డిని సలహాదారుడిగా నియమించుకుంటారనే ఓపెన్ డిస్కషన్ జరిగింది.

కానీ ప్రగతిభవన్‌లో అలాంటి అవకాశం గురించి చర్చించడానికి కూడా ఆయనకు టైమ్ దొరకలేదనే అంశాన్ని సచివాలయ అధికారులు గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రాజీవ్‌శర్మ ఉద్యోగ విరమణ చేయగానే ఆయన్ను చీఫ్ అడ్వయిజర్‌గా నియమించుకున్నారు. కానీ ఆ తర్వాత రిటైర్డ్ అయిన ముగ్గురు సీఎస్‌లకు అలాంటి అవకాశాలు దక్కలేదు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైర్డ్ అయిన ఎస్‌కే జోషికి సైతం ఇరిగేషన్ సలహాదారుడి ఛాన్స్ వచ్చింది. ఆయన ఆ పదవిలో రెండేళ్ల పాటు ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఎక్సటెన్షన్ చేయకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు.

ఇటీవలే రిటైర్డ్ అయిన ఐఎఫ్ఎస్ మహిళా అధికారి ఆర్.శోభ సైతం సలహాదారుగా నియమితులయ్యారు. ఈ అనుభవాలన్నీ కళ్లముందే కనిపిస్తుండడంతో ఇకపైన రిటైర్డ్ అవుతున్న వారిలో కొద్ది మందికి కూడా ఇలాంటి రీ-అపాయింట్‌మెంట్ తప్పదేమోననే చర్చలు జరుగుతున్నాయి.

రాష్ట్రంలో పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్లు

నర్సింగ్‌రావు (ఐఏఎస్) - ముఖ్య కార్యదర్శి సీఎంవో

భూపాల్‌రెడ్డి (ఐఎఫ్ఎస్) - (స్పెషల్) కార్యదర్శి, సీఎంవో

రాజశేఖర్‌రెడ్డి (సీఎస్ఎస్) - (స్పెషల్) కార్యదర్శి, సీఎంవో

శివశంకర్ (ఐఏఎస్) - కన్సల్టెంట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్

అనిల్ కుమార్ (ఐఏఎస్) - కమిషనర్, సివిల్ సప్లయిస్

అదర్ సిన్హా (ఐఏఎస్) - ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పశు సంవర్ధకం

అర్వీందర్ సింగ్ (ఐఏఎస్) -అదనపు కార్యదర్శి, ప్రొటోకాల్, జీఏడీ


సలహాదారులుగా ఉన్న రిటైర్డ్ ఆఫీసర్లు

రాజీవ్‌శర్మ (ఐఏఎస్) - ముఖ్య సలహాదారు

అనురాగ్‌శర్మ (ఐపీఎస్) - పోలీసు శాఖ

ఏకే ఖాన్ (ఐపీఎస్) - మైనార్టీ సంక్షేమం

కేవీ రమణాచారి (ఐఏఎస్) - సాంస్కృతిక

జీఆర్ రెడ్డి (ఐఈఎస్) - ఆర్థిక

ఆర్.శోభ (ఐఎఫ్ఎస్) - పర్యావరణం

Advertisement

Next Story