ఆర్టీసీ డిపోల ఎత్తివేత? తగ్గనున్న డిపోలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-13 01:15:48.0  )
ఆర్టీసీ డిపోల ఎత్తివేత? తగ్గనున్న డిపోలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ డిపోలు తగ్గనున్నాయి. మూసివేత లేదంటూనే.. పలు డిపోల్లో సర్దుబాటు మొదలుపెట్టారు. నష్టాలు వస్తున్నాయంటూ పక్క డిపోలకు పంపిస్తున్నారు. ఒక డిపో పరిధిలోని రూట్లలో బస్సులు నడువడం లేదని, దీంతో నష్టాలు వస్తున్నాయంటూ ఆ రూట్లకు బస్సులను బంద్​ చేసి, ఆ బస్సులను పక్క డిపోల్లో సర్దుబాటు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. సొంత బస్సులు ఏండ్ల కిందటివే కావడంతో వాటిని పక్కన పెట్టాల్సి వస్తోంది. మరోవైపు కేంద్ర నిబంధనల ప్రకారం 15 ఏండ్లు దాటిన బస్సులను రోడ్డెక్కనీయవద్దంటూ అటు రవాణా శాఖ నుంచి కూడా నోటీసులు ఇస్తున్నారు.

డిపోల మూసివేతకు ప్రతిపాదనలు

ఇటీవల బస్​భవన్​లో ఆర్టీసీ అధికారులతో ఎండీ సజ్జనార్​ వరుస సమావేశాలు నిర్వహించారు. ఒక్కో డిపో వారీగా వివరాలు తీసుకున్నారు. డిపో పరిధిలోని మొత్తం బస్సులు, తిరుగుతున్న ప్రాంతాలు, ఆదాయం, నష్టంతో పాటుగా సిబ్బంది, డిపోకు ఉన్న భూములు, ఆస్తుల వివరాలన్నీ సమగ్రంగా తీసుకున్నారు. లాభ, నష్టాల ఎజెండానే ప్రత్యేకంగా సాగింది. 97 డిపోల పరిధి నుంచి అధికారుల సమగ్రంగా వివరించారు. 97 డిపోల పరిధి మొత్తం నష్టాల్లోనే ఉన్నట్లు తేలింది. కొన్నిచోట్ల ఈ నష్టాలు మూడింతలుగా ఉన్నాయి. ఫలితంగా తొలుత కొన్ని డిపోలును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా కోరుట్ల లేదా మెట్​పల్లి, హుజురాబాద్​, ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని వరంగల్​ –2 లేదా హన్మకొండ డిపో, ఘన్​పూర్​, నల్గొండ జిల్లా నార్కట్​పల్లి, హైదరాబాద్​లని జేబీఎస్​ను కూడా ఎత్తివేయాలని భావిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ డిపోలకు సంబంధించిన బస్సులను పక్క డిపోలకు పంపించారు. నార్కట్​పల్లి డిపో బస్సులను నల్గొండకు కేటాయిస్తున్నట్లు సమాచారం. డిపోలను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తున్న ప్రాంతాల్లో సిబ్బంది ట్రాన్స్​ఫర్లకు సిద్దంగా ఉండాలనే సంకేతాలు కూడా ఇస్తున్నారు.

నష్టాల సాకు

నస్టాలను సాకుగా చూపిస్తూ డిపోలను ఎత్తివేయనున్నారు. వాస్తవంగా చాలా డిపోల్లో బస్సులు ఉండటం లేదు. ఒక్క డిపోలో కనీసం 121 బస్సులు ఉండాల్సి ఉండగా, 80 బస్సులకు తగ్గించారు. వీటిలో ఇప్పటి వరకే గడువు మీరిన బస్సులు సగం మేరకు ఉంటాయి. దీనికి తోడుగా కొన్ని రూట్లలో ఆదాయం రావడం లేదని కూడా అధికారులు చెప్పుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాలకు బస్సులను ఆపేశారు. ఆదాయం రాకపోవడంతో కొన్ని డిపోల్లో బస్సులను నడుపలేక ఇతర డిపోలకు అలాట్​ చేస్తున్నారు. మరోవైపు గడువు మీరిన బస్సులను సైతం పక్కకు పెట్టాల్సి వస్తుండటంతో డిపోల్లో బస్సులు ఉండటం లేదు. ఇప్పటికే గ్రేటర్​లో కొన్ని డిపోలకు ఎత్తివేశారు. హైదరాబాద్​ –3 డిపోలో కార్యకలాపాలు ఆపేసి, సిబ్బందిని ఇతర డిపోలకు అటాచ్​ శారు. మియాపూర్​ డిపోను ఒకటి జిల్లాకు సర్దుబాటు చేశారు. ఇటీవల పికెట్‌ డిపో క్లోజ్‌ అయింది. తొలి విడుతలో ఎక్కువ నష్టాలు వస్తున్న దాదాపు 17 డిపోలను మూసివేయాలని అధికారులతో సమీక్షించినట్లు తెలుస్తోంది.

మూసేసి.. లీజుకు

మూసేసిన డిపోల పరిధిలోని జాగాలను, బిల్డింగ్ లను లీజుకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలుండగా, 9,708 బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో 3,107 హైర్‌ బస్సులు నడుస్తున్నాయి. వచ్చేనెల దాదాపు 600 బస్సులు పక్కన పెట్టాల్సి వస్తోంది. అవి రెండేండ్ల కిందటే గడువు మీరిపోయాయి. ఆ స్థానంలో 500 ఎలక్ట్రికల్​ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారు. దీంతో చాలా డిపోల్లో బస్సుల సంఖ్య తగ్గిందని, స్టాఫ్‌ లేరని, ఓఆర్‌ తగ్గిందనే కారణాలు చెప్తూ డిపోలు తగ్గించే ప్లాన్​ చేస్తున్నారు. ఆర్టీసీని లేదా సంస్థ ఆస్తులను ప్రైవేట్‌‌‌‌కు అప్పగిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. నాలుగు నెలల్లో సెట్‌‌‌‌ కాకపోతే సీఎం కేసీఆర్‌‌‌‌ ఆర్టీసీని ప్రైవేట్​కు ఇచ్చేస్తామన్నారని సంస్థ చైర్మన్ కూడా గతంలో ప్రకటించారు. తాజాగా డిపోలను మూసివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీసీ పరిస్థితిని డోలాయానంలో పడేసి, ప్రైవేట్​కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్టీసీలోకి ఓ కీలక యూనియన్​ నేత వెల్లడించారు. చాలా మేరకు డిపోలను ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారని, కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రాఫిక్​ను బట్టి బస్సులపై నిర్ణయం : వీసీ సజ్జనార్​, ఆర్టీసీ ఎండీ.

ఆర్టీసీ డిపోల మూసివేతపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ను వివరణ కోరగా.. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు కొనసాగుతాయన్నారు. అలాంటి ప్రతిపాదన లేదని, అయితే, ట్రాఫిక్‌ని బట్టి డిపో బస్సులు పెరగవచ్చు లేదా తగ్గవచ్చన్నారు.

Advertisement

Next Story

Most Viewed