నీట్ కౌన్సెలింగ్‌‌లో స్థానికత ఇష్యూ.. తెలంగాణ విద్యార్థులకు ఊరట

by Gantepaka Srikanth |
నీట్ కౌన్సెలింగ్‌‌లో స్థానికత ఇష్యూ.. తెలంగాణ విద్యార్థులకు ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ కౌన్సెలింగ్‌(NEET Counselling)లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టు(High Court)ను ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అంగీకారం తెలిపింది. కౌన్సెలింగ్ సమయం అతి తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. కాగా, స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. స్థానికతను నిర్ధారిస్తూ.. నాలుగు రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.

అన్ని తీర్పులు స్పష్టంగా ఉన్నా.. మళ్ళీ కోర్టును ఆశ్రయించారన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను విద్యార్థుల తరపు న్యాయవాది విభేదించారు. కేవలం రెండు, మూడు సంవత్సరాలు చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికత దూరం చేయకూడదన్నారు. మెరిట్స్‌లోకి వెళ్లే అంత సమయం ఇప్పుడు లేకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సీజేఐ కోరారు. విద్యార్థుల భవిష్యత్, ప్రస్తుత సమయాభావం కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం ప్రతివాదులందరికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కి హారయ్యేందుకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం తీర్పు చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed