ఆర్ఓబీ నిర్మాణాల్లో వేగం పెంచండి

by Sridhar Babu |
ఆర్ఓబీ నిర్మాణాల్లో వేగం పెంచండి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలు చోట్ల నిర్మాణంలో ఉన్న ఆర్ఓబీ పనుల్లో వేగం పెంచేలా చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట కొత్త ఆర్​యూబీలు మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను నిజామామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా మంత్రిని కలిసి రైల్వేలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ అర్వింద్ ఈ మేరకు మీడియాకు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న ఆర్​ఓబీల నిర్మాణాలను వేగవంతం చేసేలా అధికారులకు తగు సూచనలు జారీ చేయాలని కోరారు. వారానికి ఒకసారి నడిచే ఖాజీపేట, దాదర్ రైలుని త్వరగా ప్రారంభించాలని, వారానికి మూడుసార్లు వచ్చేలా చూడాలని కోరారు.

దాంతో త్వరలో నడిచేలా తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్టు ఎంపీ పేర్కొన్నారు. అవసరమైన చోట రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్ యూబీ) ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని, నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి రైలు నడపాలని కోరారు. పార్లమెంటు పరిధి మీదుగా తిరుపతి, ముంబై నగరాలకు కొత్త రైళ్లను నడపాలని కోరారు. గత రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం కారణంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆర్మూర్ -ఆదిలాబాద్ లతో పాటు బోధన్ -బీదర్ రైల్వే లైన్ల మంజూరు కోసం చర్యలు వేగవంతం చేయాలని కోరారు.

అమృత్ భారత్ కింద రూ. 53 కోట్లతో చేపడుతున్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ఎంపీ అర్వింద్ మంత్రికి వివరించారు. ఇవే కాకుండా పార్లమెంట్ పరిధిలో రైల్వేల అభివృద్ధికి సంబంధించిన పలు ఇతర అంశాలను కూడా రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. తాను చేసిన విజ్ఞప్తుల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారని, తగు చర్యలు చేపట్టేలా అధికారులకు ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన మంత్రికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed