పార్టీలేవైనా రాష్ట్ర నేతలంతా ఒక్కటే.. "అలయ్ బలయ్"లో సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |   ( Updated:2024-10-13 14:54:43.0  )
పార్టీలేవైనా రాష్ట్ర నేతలంతా ఒక్కటే.. అలయ్ బలయ్లో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నా తెలంగాణ సంస్కృతిలో కీలకమైన ‘అలయ్ బలయ్’ సంప్రదాయాన్ని సమిష్టిగా కొసాగించుకోవాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా జరుపుకునే అతి పెద్ద పండుగ దసరా అని, దాంట్లో భాగంగా బండారు దత్తాత్రేయ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారని, ఇకపైన కూడా ఇది కంటిన్యూ కావాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలను ఈ కార్యక్రమం ద్వారా ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్న ఘనత దత్తాత్రేయకు దక్కిందని, ఇప్పుడు ఆయన వారసురాలిగా ఆ కార్యక్రమాన్ని బండారు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఈ ఒరవడి కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతిలోనే ‘అలయ్ బలయ్’కి ప్రత్యేక స్థానమున్నదన్నారు. అంతరించిపోతున్న మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ‘అలయ్ బలయ్’ ద్వారా దత్తాత్రేయ పునరుద్ధరించడానికి 19 ఏండ్ల క్రితం శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.

ప్రతీ సంవత్సరం దసరా పండుగ మరుసటి రోజున ‘అలయ్ బలయ్’ ఆనవాయితీగా జరుగుతున్నదని, రాజకీయాలతో సంబంధం లేకుండా దత్తాత్రేయ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సంస్కృతిని తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు పలు రాష్ట్రాల గవర్నర్లు, రాజకీయ నాయకులను ఆహ్వానించి వారికి పరిచయం చేయడం మంచి పరిణామమన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినా లక్ష్యం సాకారం కావడంపై అనుమానాలు వచ్చిన సమయంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు ‘అలయ్ బలయ్’ స్ఫూర్తిగా ఉపయోగపడిందన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలతో సంబంధం లేకుండా మన సంస్కృతి, సంప్రదాయాలే పునాదిగా ఒక వేదిక మీదకు వచ్చినట్లుగానే ప్రజలందరి ఉమ్మడి ఆకాంక్షగా తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే డిమాండ్‌తో పొలిటికల్ జేఏసీలోకి కూడా అన్ని పార్టీల నేతలు కలిసి రావడాన్ని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఈ స్ఫూర్తి తెలంగాణ ఉన్నంతకాలం కంటిన్యూ కావాలని కోరారు.

ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీల వారీగా కార్యక్రమాలు జరిగేవని, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్షతో జరిగిన ఉద్యమంలో మాత్రం ఈ ప్రాంతానికి చెందినవారంతా అన్ని విభేదాలను పక్కన పెట్టి ముందడుగు వేయడానికి ‘అలయ్ బలయ్’ స్ఫూర్తి దోహదపడిందని సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణ ప్రాంతంలో దసరా పండగ అనగానే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయని, ‘అలయ్ బలయ్’ అనగానే బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారని, దాదాపు రెండు దశాబ్దాలుగా నిబద్ధతతో దీన్ని నిర్వహించడమే ఇందుకు కారణమన్నారు. ఇప్పుడు ఆయన వారసురాలిగా బండారు విజయలక్ష్మి చొరవ తీసుకుని కంటిన్యూ చేస్తున్నందుకు అభినందనలు అని ఆమెను ప్రశంసించారు. ఇకపైన కూడా ఆమె అదే పట్టుదలతో కొనసాగిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం తరఫునా, పార్టీ తరఫునా తనతో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మన బాధ్యత అని స్పష్టం చేయదల్చుకున్నామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. పార్టీలేవైనా రాష్ట్రానికి చెందిన మనమంతా ఒక్కటేననే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed