Nellore District:సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమం

by Jakkula Mamatha |
Nellore District:సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాయుగుండం బలపడి తుఫాన్ తీవ్రతరం అవుతుందని, దీని ప్రభావం వలన ఈ నెల 26 నుంచి 28 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తుగా మత్స్యకారులను సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అయినప్పటికీ నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది(09) మంది మత్స్యకారులతో కూడిన మెకనైజేడ్ బోట్ తిరుపతి తీరం వాకాడు మండలంలోని వాడపాలెం మరియు వై.టి.కుప్పానికి సముద్రంలో 14 కిలోమీటర్ల దూరంలో బోట్ ఇంజన్ పాడైపోవడంతో బోట్‌లో ఉన్న జాలర్లు సమాచారం అందించారు.

ఈ మేరకు నిన్న(మంగళవారం) సాయంత్రం తిరుపతి జిల్లా కలెక్టర్ వారికి తెలుపగా వారు సత్వరమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో సంప్రదించి సంబంధిత కృష్ణ పట్నం పోర్టు వారి సహకారంతో వెంటనే పెద్ద పడవల సహాయముతో దుగ్గరాజపట్నం వద్ద చిక్కుకుపోయిన IND TN 02 MM2588 బోట్‌తో పాటు బోగోలు మండలం పాతపాలెం, చెన్నరాయునిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులను సురక్షితంగా బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణపట్నం చేర్చడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సదరు మత్స్యకారులు వెంటనే స్పందించి తమను కాపాడిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి వారి యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story