R&B: వరంగల్ ఆసుపత్రి నిర్మాణ వ్యయంపై ఆర్అండ్ బీలో అలజడి!

by Shiva |
R&B: వరంగల్ ఆసుపత్రి నిర్మాణ వ్యయంపై ఆర్అండ్ బీలో అలజడి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయం పెంపుపై ఆర్అండ్‌బీ శాఖలో అలజడి మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంలో కృతనిశ్చయంతో ఉండటంతో ఆ శాఖ ఉన్నతాధికారుల్లో గుబులు షురూ అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యయ ఖర్చులు పెంచమంటేనే తాము పెంచామని సంబంధిత అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే, రెండు వర్గాలుగా చిలిపోయిన ఆర్అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు.. ఇంజినీరింగ్ విభాగ అధిపతులు.. భిన్నస్వరాలు వ్యక్తపరచడం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. ఈ తాజా పరిణామంపై ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. మరో వర్గం మాత్రం సంబురాల్లో మునిగి తేలుతున్నది.

కాగా, వరంగల్‌లో టిమ్స్ వంటి భారీ హాస్పిటల్ నిర్మాణానికి ఏ బ్యాంకు రుణం ఇచ్చేందుకు ముందుకు రాకపోయే సరికి.. నిధుల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పు తీసుకున్నది. టీఎస్‌ఎస్‌హెచ్‌సీఎల్‌ను ఏర్పాటు చేసి మరి ఆస్పత్రి నిర్మాణానికి జైలు స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి రుణం తీసుకుంది. మొత్తం రూ.1,173 కోట్లు రుణం పొందింది. అంతకు ముందే టీఎస్‌ఎస్‌హెచ్‌సీఎల్‌కు సర్వే నంబరు 31, 32లోని 2,75,759 గజాల స్థలాన్ని బదిలీ చేసింది. కాగా, వరంగల్‌ జైలు స్థలాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడంపై గతంలోనే నాటి కాంగ్రెస్‌ నేత బక్క జడ్సన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు అప్పటి ప్రభుత్వం. ఇటీవల సీఎం ఈ అంశాలపై రివ్యూ చేయడంతో వివాదం తెరపైకి వచ్చింది.

న్యాయ విచారణకు వెళ్తుందా?

వరంగల్, ఎల్‌బీనగర్‌, సనత్‌నగర్, ఆల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలతో పాటు 17 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటల్స్ కన్ స్ట్రక్షన్ పనుల్లో అవకతవకలు జరిగినట్లు తేలితే న్యాయ విచారణ జరిపించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం, ఫోన్ ట్యా పింగ్ అంశాలతో ఇరకాటంలో ఉన్న బీఆర్ఎ‌స్ పార్టీ ఈ అంశం బలంగా తెరపైకి వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏంటా కథాకమామిషు!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్‌లో టిమ్స్ నిర్మాణానికి 135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కేంద్ర కారాగారాన్ని తొలగించి దాని స్థానంలో ఆసుపత్రి నిర్మాణానికి నడుం బిగించింది. వరంగల్‌లో 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం షురూ చేసింది. రూ.1,100 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించి రెండుసార్లు అంచనా వ్యయాన్ని అమాంతంగా రూ.1,726 కోట్లకు పెంచేసింది. దీనికి సంబంధించిన జీవోలను సీక్రెట్‌గా ఉంచింది.

రేవంత్ సర్కార్ వచ్చాక ఆసుపత్రి నిర్మాణంపై రివ్యూ చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. దీంతో విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇదే కాకుండా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న మూడు టిమ్స్ భవనాలపై కూడా విజిలెన్స్ విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆర్అండ్‌బీ శాఖ ఉన్నతాధికారుల్లో చర్చనీయాంశమైంది. ఎల్‌బీనగర్‌లో టిమ్స్ రూ.900 కోట్లు, సనత్‌నగర్ రూ.882 కోట్లు, ఆల్వాల్ రూ.897 కోట్ల వ్యయ నిర్మాణంపై ఇప్పటికే ఆడిట్ నిర్వహించి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ దిశగా ముందుకుళ్తోంది. ఈ మూడు టిమ్స్ ఆసుపత్రులకు సంబంధించి రూ.2,679 కోట్ల అంచనా వ్యయాన్ని రూ.3,562 కోట్లకు పెంచడంపై కాంగ్రెస్ ప్రభుత్వం గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed