పాపం... పదినెలల పసికందు ప్రాణం కాపాడండి

by M.Rajitha |
పాపం... పదినెలల పసికందు ప్రాణం కాపాడండి
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా పదినెలల పసికందు అంటే పాకుతూ.. లేచి నడవటానికి ప్రయత్నిస్తూ.. చిన్న చిన్న పదాలు పలకడం నేర్చుకుంటుంటే తల్లి తండ్రులు మురిసి పోతారు. కాని కదలక మెదలక మంచానికే అతుక్కుపోతే ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. అంతేకాదు ఆ పాప తిరిగి మామూలుగా అవ్వాలి అంటే కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరమని తెలిస్తే, వాళ్ళకు వచ్చే అరకొర జీతంతో ఆ పాపను ఎలా బతికించుకోగలరు..? ఓ వైపు బిడ్డకు ఏమవుతుందో అనే బాధ, బాగవ్వాలంటే కోట్ల రూపాయల మందు కోసం డబ్బులు ఎలా కూడబెట్టాలో తెలియక మీడియా ముందుకు వచ్చి మా బిడ్డను బతికించుకోడానికి సహాయం చేయండని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే జనగామ పట్టణానికి చెందిన ప్రశాంత్, సంపూర్ణల కుమార్తె వైష్ణవి. గతేడాది సెప్టెంబర్లో జన్మించిన వైష్ణవి ఐదునెలలు గడిచినా కదలకపోవడం, బోర్లాపడకపోవడం చేయకపోయే సరికి, అనుమానం వచ్చి స్థానిక వైద్యులను సంప్రదించగా, వారి సూచన మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా లక్షల మంది పిల్లల్లో ఒకరికి అరుదుగా వచ్చే స్పైనల్ మస్కులర్ ఎట్రోపి టైప్-1 గా తేల్చారు.

కండరాలు వదులుగా ఉండి, కూర్చోలేక పోవడం, నడవలేక పోవడం లాంటి లక్షణాలు కలిగిన ఈ వ్యాధికి ఉపయోగించే మెడిసిన్ రూ.17 కోట్ల విలువ కలిగి ఉండి, అమెరికా నుండి మాత్రమే దిగుమతి చేసుకోవాలని వైద్యులు చెప్పడంతో ఆ పేద తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఓ కంపెనీలో నెలకు 12 వేల జీతానికి డ్రైవర్ గా పనిచేసే ప్రశాంత్ కు ఏం చేయాలో పాలుపోక దేవుడి మీద భారం వేసి పాపను ఇంటికి తీసుకు వచ్చాడు. రెండు రోజుల కిందట పాపకు ఊపిరి అందకపోవడంతో ఎంజీఎం హాస్పిటల్ పిల్లల వార్డులో చేర్చారు. తమ బిడ్డ ప్రాణం కాపాడాటానికి దాతలు, మానవతావాదులు సహాయం చేయాలని కోరుతున్నారు. మీలో ఎవరైనా ఆ పాప వైద్యానికి ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటే తండ్రి ప్రశాంత్ ను 8247266886 నంబరులో సంప్రదించగలరు.

Next Story

Most Viewed