కార్మికుడి ఆత్మహత్యాయత్నం...మేనేజర్​ వేధింపులే కారణం

by Sridhar Babu |   ( Updated:2022-11-27 14:50:36.0  )
కార్మికుడి ఆత్మహత్యాయత్నం...మేనేజర్​ వేధింపులే కారణం
X

దిశ చౌదరిగూడ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లాల్ పహాడ్ లో గల జీబీ బేకర్స్ బ్రిటానియా కంపెనీకి సంబంధించిన మేనేజర్​ మల్లికార్జున్ కార్మికుల పట్ల యమకింకరుడై వేధిస్తుండడంతో వాటిని తాళలేక కాంట్రాక్ట్ కార్మికుడు కమ్మెరిప్యాట్ల తిరుమలేష్(27) ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తనను మల్లికార్జున్ వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

ఎందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు...?

మండల పరిధిలోని లచ్చంపేట గ్రామానికి చెందిన తిరుమలేష్ చాలాకాలంగా బిస్కెట్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. గత నాలుగు నెలల క్రితం కంపెనీలో పనిచేస్తున్న సమయంలో యంత్రంలో చేయి పడి తన చేతి వేళ్లను పోగొట్టుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని తన ఉద్యోగం పర్మినెంట్ చేయాలని తిరుమలేష్ కొంతకాలంగా కోరుతూ ఉన్నాడు. దీనికి మేనేజర్ మల్లికార్జున్ పర్మినెంట్ చేయడం కుదరదు నీ చావు నువ్వు చావు అంటూ ఆత్మాయత్యాయత్నానికి ప్రేరేపించినట్లు మాట్లాడటంతో మనస్థాపానికి గురైన తిరుమలేష్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది.

ఎవరి మల్లికార్జున్..?

మల్లికార్జున్ ఇతర ప్రాంతాల కార్మికులను ఎన్నో సందర్భాలలో చిన్న చూపు చూస్తూ కార్మికులపై కర్కశంగా వ్యవహరిస్తూ ఉంటాడని తోటి కార్మికులు వాపోయారు. దీనికి తోడు కంపెనీ అంతర్గత విషయాలు బయటకు పొక్కకుండా ఉద్యోగులను బెదిరించేవాడని కొందరు తెలిపారు. అతని దుర్మార్గాలతో కార్మికులు విసిగిపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకం అనుభవిస్తున్నారు. అంతేకాకుండా అతని తెలివితేటలతో కంపెనీ యాజమాన్యంతో పాటు అధికారులను,నాయకులను అడ్డుపెట్టుకొని తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉంటాడని మండల ప్రజలు అంటున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

తిరుమలేష్ సోదరుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు మల్లికార్జున్, జీబీ బేకర్స్ బ్రిటానియా కంపెనీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సక్రం తెలిపారు.

కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి

కంపెనీ యజమాన్య వేధింపులకు తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న తిరుమలేష్ 90 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఈ పరిస్థితికి కారణమైన మేనేజర్ మల్లికార్జున్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని లచ్చంపేట గ్రామస్తులు, ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed