మరో కొన్ని గంటల్లో తేలనున్న ‘మహేశ్వరం’ ఫలితం.. ఎవరి ఫ్యూచర్ ఏమిటో..?

by Mahesh |
మరో కొన్ని గంటల్లో తేలనున్న ‘మహేశ్వరం’ ఫలితం.. ఎవరి ఫ్యూచర్ ఏమిటో..?
X

దిశ, బడంగ్​పేట్​ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో మహేశ్వరం నియోజకవర్గంలో సొంత పార్టీల నేతలతోనే వివిధ పార్టీల అభ్యర్థులు బేజారయ్యారు. ‘నాది పార్టీలో ఇన్నేళ్ల సీనియారిటీ.. నేను లీడ్​ఇంత ఇస్తా.. అంత ఇస్తా.. ఈ ఏరియాలు అన్నీ నేను కవర్​ చేసుకుంటా.. ఇన్ని బూత్‌లు నేనే చూసుకుంటా.. నా రేటు ఇంత అయితేనే నేను పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తా.. ఇంకెవరైనా నా ఏరియాలో తలదూరిస్తే మాత్రం రేపు మీరు ఓడిపోతే నన్ను మాత్రం అడగొద్దు’ అని చెప్పారు. తమ మాయమాటలతో, అత్యాశ చూపెట్టి నేత స్థాయిని బట్టి వేలు, లక్షలు, కోట్లు డిమాండ్​ చేసి అభ్యర్థుల నుంచి సొంత పార్టీ నేతలే పెద్ద ఎత్తున వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ నేతల మాటలు తప్పనిసరి పరిస్థితుల్లో విన్నా అభ్యర్థులు బేరం కుదుర్చుకొని ఆ నేతలకు పార్టీ మార నీయకుండా గుప్పిట్లో పెట్టుకొని డబ్బులు ముట్టజెప్పారు. డబ్బులు చేత పడగానే కొందరు నేతలు సైడ్​అయ్యారు.

మరి కొందరు నేతలు నామ్‌కే వస్తేగా పనిచేశారు. మరి కొందరు నేతలు ఒక్క రూపాయి ముట్టకుండానే ఆయా అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డబ్బులు తీసుకున్న నేతలను అభ్యర్థలు కంట కనిపెడుతూనే ఉన్నారు. ఇక ఆ సమయంరానే వచ్చింది. మరికొన్ని గంటల్లో మహేశ్వరంలో నేతల భవితవ్యం తేలనుంది. ఏ ఏరియాలో ఎంత లీడ్​ వస్తదో అన్ని వివరాలు బట్టబయలు కానున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి 3వ తేదీన జరిగే కౌంటింగ్​ రోజు గెలిస్తే సరేసరి ..లేదంటే మాత్రం ఆ నేతల సంగతి చెబుతామని ఆయా పార్టీల అభ్యర్థులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. మరి కొందరైతే లీడ్​ ఇవ్వకపోతే డబ్బులు తిరిగి వసూలు చేసేదెలా అన్నదానిపై కూడా దృష్టి కేంద్రీకరించారు. అంతేగాకుండా లీడ్​ ఇచ్చిన నేతలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఇంతకుముందే ప్రకటించారు. డబ్బులు వసూలు చేసి లీడ్​ ఇవ్వని నేతల చిట్టాను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

మహేశ్వరం పోటీలో 27 మంది.. ఎవరికి ఎన్ని ఓట్లో మరి?

మహేశ్వరం నియోజకవర్గం నుంచి 27 మంది అభ్యర్థులు పోటీ చేయగా, అందులో కేవలం ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 25 మంది పురుషులే ఉండటం గమనార్హం. మహేశ్వరం నియోజకవర్గం బీఆర్‌ఎస్​ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్, కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా కొత్త మనోహర్​రెడ్డి, ధర్మ సమాజ్ ​పార్టీ అభ్యర్థిగా అమరేందర్​గుండ్రపల్లి, ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థిగా ఈరంకి సందీప్​గౌడ్, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా కుంభం సురేష్, తెలంగాణ రిపబ్లికన్​​పార్టీ అభ్యర్థిగా నరసింహారెడ్డి ద్యాప, పిరమిడ్​ పార్టీ ఆఫ్​ ఇండియా అభ్యర్థిగా సి.బ్రహ్మం రెడ్డి, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా మల్లేశ్​ పిప్పల కురుమ, దేశ్​జన్హిత్​ పార్టీ అభ్యర్థిగా మహ్మద్​ తాజ్​, జన రాజ్యం పార్టీ అభ్యర్థిగా లక్ష్మణాచారి పోకూరి, జై శంఖారావం పార్టీ అభ్యర్థిగా కే లక్ష్మారెడ్డి, భారతీయ క్రాంతి సంఘ్​పార్టీ అభ్యర్థిగా టీ శ్రీరాములు యాదవ్​, ఆలిండియా మజ్లిస్​ఇ ఇంక్వాలాబ్​ ఇ మిల్లత్​ అభ్యర్థిగా సయ్యద్​ అజీముద్దీన్​, జై మహాభారత్​పార్టీ అభ్యర్థిగా హుమా అబ్బాసీ, స్వతంత్ర అభ్యర్థిగా ఈసరి సూర్య ప్రకాశ్​రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా ఉప్పుల మహేందర్, కత్తుల యాదయ్య, కంకణాల శ్రీకాంత్, చిక్కుళ్ల శివప్రసాద్, పగిళ్ల నరసింహారెడ్డి, ఆర్ రఘురాం నాయక్​, బీ రామ్‌చరణ్,​సబిత మద్ది, సభావత్​ రవీందర్, సుబ్రహ్మణ్య రాహుల్​ పోటీ చేస్తున్నారు.

Advertisement

Next Story