నిరుపయోగంగా డంపింగ్‌ యార్డులు.. పాత బావులు, గుంతల్లో చెత్త పారబోత..

by Kalyani |
నిరుపయోగంగా డంపింగ్‌ యార్డులు.. పాత బావులు, గుంతల్లో చెత్త పారబోత..
X

దిశ, షాద్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పరిశుభ్రత కోసం ప్రతి గ్రామ పంచాయతీకి లక్షల రూపాయలు వెచ్చిస్తోంది. చెత్తను సేకరించడానికి ట్రాక్టర్లతో పాటు డంపింగ్ యార్డులను నిర్మించింది. అక్కడే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీ కోసం ప్రత్యేకంగా షెడ్లను నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డులు నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి పంచాయతీలు ఆదాయం పొందాలనే సదుద్దేశంతో వీటి నిర్మాణం చేపట్టారు. కానీ ఎక్కడా వినియోగంలో ఉన్నట్లు కనిపించడం లేదు.


ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని గ్రామాల్లో 47 డంపింగ్‌ యార్డులను నిర్మించారు. ఒక్కో డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కోదానికి రూ. 2.50లక్షలు ఖర్చు చేసింది. ఎక్కడో కొన్ని గ్రామాల్లో మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. మిగతా అన్నిచోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. డంపింగ్ యార్డ్ లను ఒక్కోదానికి ఈజీఎస్ (2,50,000), జీపీ(1,50,000) నిధులతో నిర్మించారు. డంపింగ్‌ యార్డుల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువు తయారీతోపాటు వానపాములను ఉత్పత్తి చేయాలని వీటిని నిర్మించారు. ఇక్కడ తయారైన ఎరువును రైతులకు విక్రయిస్తే పంచాయతీకి కొంత ఆదాయం సమకూరుతుంది. కానీ చెత్తతో ఎరువులు తయారు చేస్తున్న ఘటనలు ఏ ఒక్క గ్రామంలో మచ్చుకైనా కనిపించడం లేదు.

డంపింగ్‌ యార్డులకు చెత్తను తీసుకురాకుండా గ్రామాల సమీపంలోని పాత వ్యవసాయ బావులు, గుంతల్లో పడేస్తున్నారు. అయినా పంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కానీ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. లక్షలాది ప్రజాధనం ఖర్చుచేసి నిర్మించిన డంపింగ్‌ యార్డులను వినియోగించుకోలేకపోతున్నారు. గతంలో ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ లో కాకుండా చెరువులో వేస్తున్నారని కలెక్టర్ కు గ్రామస్తులు పిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎల్పీవో పర్యటించి విచారణ చేసిన ఘటనలున్నాయి.


Advertisement

Next Story