పసి బాలుడి ఖరీదు రూ. 60 వేలు

by Kalyani |
పసి బాలుడి ఖరీదు రూ. 60 వేలు
X

దిశ,తాండూరు రూరల్ : కిడ్నాప్ గురైన పసి బాలుడిని కేసును కరన్ కోట్ పోలీసులు ఛేదించారు. మంగళవారం తాండూరు మండలం గౌతాపూర్ లోని రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రూరల్ సీఐ నగేష్ మాట్లాడుతూ…కర్ణాటక రాష్ట్రానికి చెందిన హుస్సేన్ భాష, భార్య పిల్లలతో వివిధ ప్రాంతాలలో జీవనోపాధి పొందుతూ తాండూర్ మండలం గౌతాపూర్ గ్రామంలోని మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద తల దాచుకున్నారని చెప్పారు . ఈనెల 29న రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో పాటు సంవత్సరం పసి బాలుడిని పక్కలో పడుకోబెట్టుకుని నిద్రించారని సీఐ వివరించారు. మరుసటి రోజు ఉదయం చూసే సరికి ఏడాది పసిబాలుడు కనిపించకపోవడంతో కరన్ కోట్ పోలీసులను ఆశ్రయించారని రూరల్ సీఐ నగేష్ మీడియా ముందు వెల్లడించారు.

మిస్సింగ్ కు గురైన పసి బాలుడి ఆచూకీ కోసం సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ విఠల్ రెడ్డి వివిధ కోణాలలో ఆరా తీసిన తదుపరి ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గౌతాపూర్ చౌరస్తా వద్ద సేకరించిన సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోనే మిస్సింగ్ కు గురైన బాలుడి ఆచూకీని 24 గంటల లోపే గుర్తించగలిగామన్నారు. బాలుడిని మరో చోటికి తరలించే క్రమంలో మర్పల్లి మండలం షాపూర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామని సీఐ వెల్లడించారు. ఇందులో ప్రధాన నిందితుడు చెన్నప్ప అనే వ్యక్తి డబ్బు ఆశతో హుస్సేన్ భాష కుటుంబంలోని ఎడాది బాలుడిని తీసుకెళ్లి ముందుగా అనుకున్నట్లుగా తాండూరు పట్టణం ఇంద్రనగర్ కు చెందిన బుడిగ జంగం కృష్ణకు రూ. 60 వేల రూపాయలకు విక్రయించినట్లు గుర్తించామని చెప్పారు.

పసిబాలుడుని తీసుకున్న బుడిగె జంగం కృష్ణ కుటుంబం తాండూర్ పట్టణంలోనే ఉండగా పోలీసుల తనిఖీలు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని గుర్తించిన నిందితులు పసి బాలుడిని తన బంధువుల ఇంటికి తరలించేందుకు ప్రయత్నించారని చెప్పారు. పసి బాలుడి కిడ్నాప్ కేసులో ఆరుగురు వ్యక్తుల పాత్ర ఉందని అందులో శంకర్, పద్మమ్మ,హనుమంతు, లక్ష్మి, సాయమ్మ,పద్మ లు కాగా హనుమంతు, లక్ష్మి ఇద్దరు కూడా పరార్ లో ఉన్నట్లు చెప్పారు. పరార్ లో ఉన్న ఇద్దరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. బాలుడిని ట్రేస్ చేసేందుకు చాకచక్యంగా వ్యవహరించిన కరన్ కోట్ పోలీసులు ప్రతాప్ సింగ్, రవి, మహేష్, దస్తప్ప, నర్సిములు లను సీఐ నగేష్, ఎస్ఐ విఠల్ రెడ్డి అభినందించి రివార్డు బహుమతిని అందజేశారు. అదుపులోకి తీసుకున్న నేరస్థులపై 292 /2024,యుఎస్, 137(2) బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు నేరస్థులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు.

పోలీసులకు అభినందనలు..

ఎస్సై విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఐదు బృందాలతో 24 గంటల్లోనే మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. దీంతో కరన్ కోట్ పోలీస్ అధికారులను, సిబ్బందిని మండల ప్రజలు అభినందించారు.

Advertisement

Next Story