ఆర్ఓఆర్ చట్టం పై ప్రత్యేక దృష్టి

by Sridhar Babu |
ఆర్ఓఆర్ చట్టం పై ప్రత్యేక దృష్టి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం పై ప్రజాభిప్రాయం సేకరించేందుకు జిల్లాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. అయితే జిల్లా అధికారులు ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేయాలనే పద్ధతిలోనే సదస్సులు ఏర్పాటు చేశారు. కానీ సీరియస్​గా ప్రజల అభిప్రాయం తీసుకోవాలనే ధ్యాస లేదని తెలుస్తుంది. కేవలం ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, ప్రతిపక్ష పార్టీల జిల్లా అధ్యక్షులతో సమావేశం మామ అనిపించారు. పత్రిక ప్రతినిధులకు సైతం చెప్పకుండా సమావేశం ఏర్పాటు చేయడం పై పలు అనుమానాలకు దారితీస్తుంది.

అవగాహన సదస్సు ఇలా....

జిల్లాలో ఆర్ఓఆర్ - 2024 చట్టం బిల్లుపై అవగాహన సదస్సు, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ప్రస్తుత 2020 రెవెన్యూ (ఆర్ఓఆర్) చట్టం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ 2024 చట్టం బిల్లుపై అవగాహన సదస్సు, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతీమా సింగ్ తో కలిసి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ధరణిలో ప్రాతినిధ్యం వహిస్తున్న కమిటీ మెంబర్ కొందండ రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, బార్ అసోసియేషన్ మెంబర్ కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇంకా మెరుగైన భూ రికార్డుల విధానాన్ని తీసుకువచ్చేందుకు 2020 చట్టం స్థానంలో 2024 చట్టం తెచ్చే క్రమంలో భాగంగా మీ నుండి, రైతుల నుండి క్షేత్ర స్థాయిలో సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతున్నదని, అందుకే బహిరంగ చర్చను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం ప్రారంభం ముందు చెవెళ్ల ఆర్డీఓ సాయిరాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ప్రతిపాదిత రైట్స్ ఆఫ్ రికార్డ్ (ఆర్ ఓ ఆర్ )చట్టంపై, 20 సెక్షన్లపై సమావేశానికి హాజరైన వారందరికీ వివరించారు.

అంతేకాక 2020 ఆర్వోఆర్ చట్టం, 2024 ప్రతిపాదిత చట్టాలలోని తేడాలను సైతం వివరించారు. అనంతరం ధరణిలో ప్రాతినిధ్యం వహిస్తున్న కమిటీ మెంబర్ కొందండ రెడ్డి మాట్లాడుతూ రైతులకు కలిగే ఇబ్బందులను పరిష్కరించే అవకాశం చట్టంలో ఉండాలని, అలాగే తప్పులు సవరించే అవకాశం చట్టం కల్పించాలని, 2020 లో ఏర్పాటు చేసిన చట్టంలో అప్పీళ్లకు అవకాశం లేదని, కొత్త చట్టంలో వాటికి స్థానం కల్పించడం జరుగుతున్నదని, ఎక్కడైనా పొరపాటు జరిగితే సవరించే అవకాశం సైతం నూతన ప్రతిపాదిత చట్టంలో ఉందని, రానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి అమలులోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం వేల సంఖ్యలో బోగస్ పాస్ పుస్తకాలు ఉన్నాయని ,పాసు పుస్తకాలు ఉన్నవాళ్లకి భూములు లేవని ,ఇలాంటివన్నీ తొలగించి పారదర్శక చట్టాన్ని తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాంగా నూతన రెవెన్యూ చట్టంపై మన జిల్లా వ్యాప్తంగా అభిప్రాయాలను సేకరించి కొత్త చట్టం తెచ్చేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. కొత్త చట్టం పట్ల చాలామంది అభినందిస్తున్నారని, మార్పులు ,చేర్పులు సూచిస్తున్నారని తెలిపారు.

Advertisement

Next Story