- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తమోడుతున్న బీజాపూర్ హైవే..
దిశ ప్రతినిధి, వికారాబాద్ / చేవెళ్ల : చేవెళ్ల, మన్నెగూడ రోడ్డు అనునిత్యం రక్తమోడుతున్నది. నెలలు, రోజుల వ్యవధిలోనే వరుస ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఇప్పటికే ఈ రోడ్డు పై అనేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు పోయి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజాపూర్ హైవే మీదగా హైదరాబాద్ అప్పజంక్షన్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ మీదుగా వికారాబాద్ జిల్లాకు రావాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఉంది. గత ఆది, సోమవారం రెండు రోజుల వ్యవధిలోనే రెండు భారీ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో ఆరుగురు మృతి చెందారు. గత ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన మేకల లక్ష్మా రెడ్డి (57), అతడి భార్య మేకల భాగ్య లక్ష్మి(52) చేవెళ్ల మండలం దేవరాంపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు.
ఈ క్రమంలో చేవెళ్ల మండలం మీర్జాగూడ స్టేజీ వద్దకు రాగానే మృత్యురూపంలో వచ్చిన లారీ ఢీ కొనడంతో భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ఘటన మరువకముందే మరుసటి రోజు సోమవారం అదే మార్గంలో చేవెళ్ల మండలం ఆలూర్ గేటు దగ్గర రోడ్డు పక్కన 8 ఏళ్లుగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న రైతులపైకి మృత్యురూపంలో మరో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తున్నది. ఈ ప్రమాదం పై కేసునమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నారు.
డేంజరస్ మూల మలుపులు..
హైదరాబాద్ అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు అత్యంత ప్రమాదకరంగా ఉంది. అప్ప జంక్షన్ నుంచి మొయినాబాద్ వరకు కొంత బాగానే ఉన్నా అక్కడి నుంచి చేవెళ్ల, మన్నెగూడ వరకు రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. అసలే చిన్న రోడ్డు కావడం, మధ్యలో డివైడర్ కూడా లేకపోవడం ప్రమాదాలకు కారణం అవుతున్నది. ఇదే కాక ఈ రోడ్డులో ప్రమాదకరమైన అనేక మలుపులు కూడా ఉండడంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలకు వెళ్లే ప్రజలే కాక, పక్క రాష్ట్రం కర్ణాటక ప్రజలు కూడా నిత్యం ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. కర్ణాటక రాష్ట్రం బస్సులు ఈ మార్గంలో అనేకం వెళ్తుంటాయి. అలాంటి ఈ రోడ్డు మలుపుల దగ్గర సంబంధిత అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణంలో గత ప్రభుత్వం విఫలం..!
గత కేసీఆర్ ప్రభుత్వం బీజాపూర్ హైవేలో హైదరాబాద్ అప్ప జంక్షన్ నుండి మన్నెగూడ వరకు దాదాపు 46 కిలోమీటర్ల మేర నాలుగు లైడ్ల రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల కష్టాలు తీరుస్తామని, రోడ్డు ప్రమాదాలను అరికడతామని గొప్పలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించినా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోయారనే విమర్శలున్నాయి. నాటి ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి రోడ్డు పనులు ప్రారంభించే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. అప్పుడే అసంబ్లీ ఎన్నికలు రావడంతో గెలుపు పై దృష్టి పెట్టినా నాటి ప్రభుత్వ పెద్దలు ఫోర్ లైన్ రోడ్డును గాలికి వదిలేశారు. నాడు సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నా ఈ రోడ్డు పనులను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా ఈ ప్రాంతంపై దృష్టి సారించలేదని విమర్శలున్నాయి.
కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ముందుకు సాగని పనులు..
గత ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేసిందని కోపంతోనే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడించారు. వికారాబాద్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారు. చేవెళ్ల ఎంపీగా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించారు. పైగా వికారాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు. ఇలా ఇంతమంది ముఖ్య నాయకులున్నా ఈ బీజాపూర్ హైవే రోడ్డు విస్తరణ పనులు ఇంకా ప్రారంభించాక పోవడంపై స్థానిక ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.