అదుపు తప్పిన స్కూల్ బస్సు... డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం

by Sridhar Babu |
అదుపు తప్పిన స్కూల్ బస్సు... డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం
X

దిశ చేవెళ్ల : డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల సిల్వర్ డే స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన గుంత ఉండడంతో అందులోకి దూసుకెళ్లింది. కానీ విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు పూర్తిగా ఒక సైడ్ ఒరిగింది. ఈ ఘటన చేవెళ్ల మండలంలోని చాన్ వెళ్లి అనుబంధ గ్రామమైన ఇక్కరెడ్డి గూడ గ్రామ పరిధిలో జరిగింది. ఉదయం విద్యార్థుల స్కూల్ కు తీసుకువస్తున్న క్రమంలో సిల్వర్ డే స్కూల్ బస్సు అదుపు తప్పింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

డ్రైవర్ ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం అని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తుండటంతో ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా కుక్క అడ్డం రావడంతో ఘటన జరిగిందని డ్రైవర్ తెలిపాడు. కాగా ఇది మూడోసారి ప్రమాదం జరిగిందని సమాచారం. ఒక సీట్ లో ఐదుగురు విద్యార్థులను కూర్చోబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, స్కూల్ యాజమాన్యం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కాగా ప్రమాదం గురించి ప్రిన్సిపాల్​కు సమాచారం తెలిపినా ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

అన్న స్పీడ్ పోయిండు : సుశాంత్, 5th క్లాస్ విద్యార్థి

అన్న స్పీడ్ పోయిండు. కుక్క అడ్డం రాలే ఏమీ రాలే. డ్రైవర్ అన్న అట్ల చెపుతుండు. కొంత మందికి దెబ్బలు తగిలాయి.

రోజూ బస్సు ఫుల్లే : మౌనిక, 5th క్లాస్

అన్న స్పీడ్ పోయి గుంతలో వేసిండు. బస్సు రోజూ ఫుల్ గా ఉంటది. ఒక్క రోజు కూడా మాకు సీటు దొరకదు.

ఒక్క సీట్​లో ఐదుగురు : మాధవి, విద్యార్థి తల్లి

చిన్న సీట్ లో ఐదుగురు పిల్లలను కూర్చోబెడతారు. పిల్లలను స్కూల్ కు పంపించి పొలం చేసుకునే వాళ్లం. పిల్లలకు ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి. ఫీజు కోసం హింసించే ప్రిన్సిపాల్ ప్రమాదం గురించి చెప్పినా ఇప్పటి వరకు స్పందించకుంటే మేము ఎవరిని అడగాలి.

150 మందిని తరలిస్తున్నారు : విఠల్, విద్యార్థి తండ్రి

ఈ ఒక బస్సులోనే ఆరు గ్రామాల పిల్లలను తరలిస్తారు. 40 మంది కూర్చోవాల్సిన బస్సులో 150 మంది పిల్లలు ఉంటారు. నేను 3 రోజుల క్రితం ఫీజు కట్టడానికి స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపాల్ కి బస్సులో చాలా మంది పిల్లలు వస్తున్నారని, మా పిల్లలకు సీట్ కూడా దొరకడంలేదని, డ్రైవర్ చాలా స్పీడ్ గా పోతాడు అని చెప్పాను. కానీ పట్టించుకోలేదు.

కుక్క అడ్డం వచ్చింది : డ్రైవర్

కుక్క అడ్డం రావడంతో దానిని తప్పించబోయి బ్రేక్ వేస్తే ఒక సైడ్ కు బస్సు గుంజుకుపోయింది. నేను స్పీడ్ గా ఏమీ లేను. రోజుకు రెండు ట్రిప్పులు తిరుగుతాను. బస్సులో 40 సీట్లు ఉంటే 50 మందినే తరలిస్తాను.

Advertisement

Next Story