ఆ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్ట‌ర్ల హల్ చల్..

by Sumithra |
ఆ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్ట‌ర్ల హల్ చల్..
X

దిశ, శంషాబాద్, గండిపేట్ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఆర్ఎంపీ డాక్టర్లు రెచ్చిపోతున్నారు. వచ్చిరాని వైద్యం చేసి రోగులకు లేని తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. స్థానికంగా కొందరు ఆర్ఎంపీ ముసుగులో వైద్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తెలిసీ తెలియని వైద్యం ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేస్తుంది. అయినా స్థానికంగా వైద్య ఆరోగ్యశాఖ, అధికారులు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్లు రెచ్చిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్ర‌జ‌ల‌ ప్రాణాలను సైతం ఈ ఆర్ఎంపీ డాక్టర్లు బలి తీసుకున్నా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నే వాదనలు వినిపిస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో వారు ఎన్ని దారుణాలు చేసినా అడిగేవారు లేకుండా పోయారు. చర్యలు చూపడానికి అధికారులు వస్తే వారికి ఏదో ఒకటి ముట్టజెప్పి వారి నోరుమూపిస్తున్నారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని స్థానికులు తెలుపుతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ల వల్ల నష్టపోయిన వారు ఏదైనా ప్రశ్నిస్తే వారిని బెదిరింపులకు గురిచేస్తున్న‌ట్లు సమాచారం.

దీంతో స్థానికంగా ఆర్ఎంపీలు వీర విహారం చేస్తున్నారు. ప్రధానంగా సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ ప‌ల్లి డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్లో ఆర్ఎంపీ డాక్టర్ల ఆగ‌డాలు విపరీతంగా పెరిగిపోయాయి. వారు వచ్చిరాని వైద్యం చేస్తూ స్థానికంగా ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. స్థానికంగా పారిశ్రామిక వాడ ఉండడంతో అక్కడ స్థానికులతో పాటు స్థానికేతర ప్రజలు, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు జీవనం సాగిస్తారు. వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆర్ఎంపీ డాక్టర్లనే ఆశ్రయిస్తారు. దీంతో తెలిసి తెలియని వైద్యం చేసి వారి వద్ద నుంచి డబ్బులను ఈ ఆర్ఎంపీలు లాగేస్తున్నారు. దీనికి తోడు ఈ ఆర్ఎంపీ డాక్టర్లకు సహకరించేందుకు మెడికల్ షాపుల నిర్వాహకులు సైతం ఎగబడుతున్నారు. మెడికల్ షాపుల పేరుతో రోగుల నుంచి వందల రూపాయల బిల్లులు వసూలు చేస్తూ రోగులకు దడ పుట్టిస్తున్నారు. దీంతో రోగులు ఎవరికి చెప్పుకోలేక వచ్చిరాని వైద్యం చేయించుకొని అవస్థలు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. స్థానికంగా ఆర్ఎంపీల ఆగ‌డాల‌ను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అధికారుల మౌనం వెనుక సర్వత్రా అనుమానాలు..

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఆర్ఎంపీ డాక్టర్లు ఇష్టానుసారంగా వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ల ఆగడాలను అరికట్టాల్సిన అధికారుల పాత్ర అంతంత మాత్రంగానే ఉందని స్థానికులు తెలుపుతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ల వైద్య విధానాలను పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో వైద్యుల ముసుగులో ఆర్ఎంపీలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిందని స్థానికులు తెలుపుతున్నారు. ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స చేసే వరకు మాత్రమే పరిమితం కావాలి అనే నిబంధనలు ఉన్నాయి. కానీ ప్రాథమిక చికిత్సతో పాటు వైద్య పరీక్షలను నిర్వహించడం, పూర్తిస్థాయి వైద్యాన్ని అందించడం వంటి చర్యలను ఆర్ఎంపీలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ అధికారులు ఇలాంటి ఆర్ఎంపీల పై చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed