- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెద్దలకు లాభాలు..పేదలకు నష్టాలు.. క్వారీ, క్రషర్లతో పొంచి ఉన్న ముప్పు
దిశ, రంగారెడ్డి బ్యూరో : రాజకీయ నాయకులు, పలుకబడి కలిగిన వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. కానీ పేద, మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయి. పేదలకు నష్టం కలిగించే వ్యవహారాలు పెద్దలు చేసినప్పుడు సహాజంగానే ప్రతిపక్ష పార్టీలు పోరాటాలు చేస్తాయి. ఆ పోరాటలతో ఎంతో కొంత బాధితులకు లబ్ధి చేకూరుతుంది. కానీ ఈ పోరాటాలను విడిచి సొంత ప్రయోజనాలకే అధికార, ప్రతిపక్ష పార్టీలు పనిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే కడ్తాల్ మండలం చల్లంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఏర్పాటైన క్వారీ, క్రషర్‌తో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే ఈ గ్రామానికి చెందిన వ్యక్తి అయినప్పటికి తమకు ప్రయోజనం లేదని స్థానిక రైతులు, ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. పలుమార్లు క్వారీ, క్రషర్ ఏర్పాటుపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వివరిస్తున్నారు. ఇదే ఎమ్మెల్యే ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో క్రషర్, క్వారీ ఏర్పాటుపై వచ్చిన అంశంపై క్షుణంగా విశ్లేషించారు. ప్రజా ప్రయోజనాలకు నష్టం జరిగే విధంగా ఉంటే క్రషర్, క్వారీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా అధికారులు చేసే తప్పిదాలతో అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వస్తున్నాయని సభలో వివరించారు. నిత్యం ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తిగా పేరున్న కల్వకుర్తి ఎమ్మెల్యే స్వగ్రామంలో ఏర్పాటు చేసిన క్రషర్, క్వారీ ఏర్పాటుతో జరిగే నష్టంపై ఎందుకు మాట్లాడటం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఫైరవీలతోనే లీజు అనుమతి...
ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా అధికార పార్టీకి చెందిన నేతలు తమవాటలకు ఆశపడి బడా వ్యాపారులకు లీజులు ఇవ్వడం జిల్లాలో ఆలవాటైంది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చల్లంపల్లి గ్రామ పరిధిలోని 165 సర్వే నెంబర్లో 20 ఎకరాల్లో మెటీరియల్ తీసేందుకు లీజు తీసుకున్నారు. కడ్తాల్ మండలం గడ్డమీద తండా గ్రామ పరిధిలోని 434 సర్వే నెంబర్లో క్రషర్ ప్లాంట్ ఏర్పాటు కోసం 12 ఎకరాలు లీజుకు తీసుకొని నిర్వహిస్తున్నారు. అయితే క్వారీ, క్రషర్ ఏర్పాటు చేసిన పరిసరాల్లో పంట పొలాలు, తోటలు, కోళ్ల ఫామ్లున్నాయి. సాగులో ఉన్న పంటలను, పశువులకు లభించే పశుగ్రాసాన్ని లెక్కలోకి తీసుకోకుండా రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఎన్వోసీ జారీ చేశారు. మండల రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎన్వోసీ ఆధారంగా చేసుకొని పీసీబీ అధికారులు అదే పద్ధతితో ఎన్వోసీలు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో వ్యాపారులు క్షేత్రస్ధాయిలో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్ధానికంగా ఉన్న 100 మందికిపైన రైతులు, పరిసర ప్రాంతాల ప్రజలు నెత్తి నోరు కొట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.
చోటా నాయకులను లోబరుచుకొని...
ఈ క్రషర్ ఏర్పాటుపై మొదట అందరూ కలిసి కట్టుగా గళం విప్పినప్పటికి క్రమ క్రమంగా రాజకీయ ఎత్తుగడలతో స్ధానికంగా ఉండే ప్రజాప్రతినిధుల సహకారంతో నయానో బయానో కొందరిని నోర్లు మూయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బలంగా గళం విప్పే వాళ్లను పట్టించుకోకుండా తాత్కలికంగా మాట్లాడే వాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడి ఒప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో 100 మంది రైతులు పోరాటాలకు దిగితే చివరికి 10 మందికే పరిమితమైంది. వీళ్లు చివరికి బాధితులుగానే మిగిలిపోయారు. కానీ సమస్యలకు పరిష్కరం దొరకలేదు. బాధితులు మండల రెవెన్యూ అధికారి, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ స్థాయి వరకు వివిధ సందర్భాల్లో ఫిర్యాదులు చేశారు. కానీ వీరు ఎవరూ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మైనింగ్ జిల్లా అధికారికి, పీసీబీ, మైనింగ్ ఏడీ, భూగర్బవనరుల శాఖ డైరెక్టర్లకు సైతం తమ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు భూగర్బ వనరుల శాఖ డైరెక్టర్ రోనాల్డ్ రోస్ స్పందిస్తూ... స్ధానిక తహసీల్ధార్ ఇచ్చిన ఎన్వోసీ ఆధారంగానే అనుమతులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రజాభిప్రాయ సేకరణతోనే క్వారీ, ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తే అనుమతులున్న తర్వాత ఎవరూ ఏమీ చేయలేమని చెబుతున్నారు. అంతేకాకుండా క్వారీ, క్రషర్ ఏర్పాటుపై ఆందోళన చేసిన వారిపై అధికార పార్టీ నేతల ఒత్తిడి చేసి లోబరుచుకున్నారని ఆరోపణలున్నాయి.
కాంట్రాక్ట్ కోసమేనా...?
హైదరాబాద్ టు శ్రీశైలం వరకు ఫోర్ వే లైన్ రాహదారి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ పనుల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యాపారులతో స్ధానిక ప్రజాప్రతినిధి ఒప్పందం మేరకు క్వారీ, క్రషర్ ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుత శ్రీశైలం రాహదారికి 5 కి.మీ పరిధిలోనే ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం గమనార్హం. కంకర, డస్ట్ సప్లయ్‌కు దగ్గరలో ఉండేందుకే చెల్లంపల్లి గ్రామ పరిధిలోని కొన్ని గుట్టలను ఎంపిక చేసుకొని ఫైరవీలతో మైనింగ్‌కు అనుమతులు తీసుకున్నట్లు స్పష్టమైతుంది. స్ధానిక ప్రజాప్రతినిధులకు ప్రజల ప్రయోజనాల కంటే వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలే ముఖ్యమని స్పష్టమవుతుంది.
ఎమ్మెల్యే సారూ.. మా బాధలు వినండి : గురుక మల్లేష్, రైతు, చెల్లంపల్లి
మా అభిప్రాయం లేకుండానే మైనింగ్‌కు అనుమతులు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎమ్మెల్యే సొంత గ్రామమైన మాకు న్యాయం జరగడం లేదు. ఇకనైనా మా బాధలు పట్టించుకోవాలని వేడుకుంటున్నాము. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పంట పొలాల పక్కన క్రషర్, క్వారీలు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. బ్లాస్టింగ్ చేసినప్పుడు పశువులు, పంటపొలాలు దెబ్బతింటున్నాయి.
కాసుల కోసం కష్టాలు తెచ్చారు : శ్రీను, గడ్డమీది తండా
రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోట్ ఆధారంగానే క్వారీ, క్రషర్కు అనుమతినిచ్చినట్లు స్వయంగా భూగర్భవనరుల శాఖ డైరెక్టర్ రోనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. క్షేత్రస్ధాయిలో జరిగే నష్టాలను, కష్టాలను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి మాపై దుమ్ముపోశారు. అధికారులు చేసిన తప్పిదాలతో సుమారుగా 5 గ్రామాలకు చెందిన ప్రజలు, 300 ఎకరాల పంటలు, రైతులు అన్ని రకాలుగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రారంభ సమయం కావడంతో ప్రజలకు పూర్తి స్ధాయిలో అర్ధం కావడం లేదు. పూర్తైన తర్వాత మైనింగ్ సప్లయ్ అవుతున్నప్పుడు ప్రజలు నరకం చూస్తారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రజల క్షేమాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.