ఓపీ 300...గదులు రెండే...

by Sridhar Babu |
ఓపీ 300...గదులు రెండే...
X

దిశ, ఆమనగల్లు : రాష్ట్ర రాజధానికి అతి చేరువలో గల ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను ఇరుకు గదులలో అందిస్తున్నారు. కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు ముఖ్య కూడలి అయిన ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి నిత్యం సుమారు 300 ఓపీ సేవలు కొనసాగిస్తున్నారు. వైద్యం కోసం వచ్చే రోగులు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. ప్రసవానికి వచ్చే గర్భిణులు

వారి బంధువులు అసౌకర్యాలతో ఇబ్బంది పడుతుండడంతో ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయకుండా, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇరుకైన గదులు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఆరు ఇరుకు గదులతో కొనసాగుతున్న ఆస్పత్రిలో రెండు రూములలో ఓపీ సేవలు కొనసాగిస్తున్నారు. వైద్య పరికరాలు దాచుకోలేని స్థితిలో ఆ గదులు ఉన్నాయి. వైద్య సేవల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆ సమయంలో వర్షం కురిస్తే తడవాల్సిందే.

నిధులు మంజూరైనా ఫలితం శూన్యం

శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో అన్ని రకాల హంగులతో కూడిన నూతన ఆసుపత్రి భవనం నిర్మించాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ 17.50 కోట్లతో నూతన భవనం నిర్మించుటకు శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చి, వైద్య సేవలను ఇరుకు గదులలో కొనసాగిస్తున్నారు. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకు వైద్య సేవలను విశాలమైన గదులు ఉండే అద్దె భవనంలో కొనసాగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రోగులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే : నాగరాజు, వైద్యులు





వైద్య సేవల కోసం వచ్చే రోగులు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ కనీసం 300 మంది రోగులకు ఓపీ సేవలను అందిస్తున్నాం. విశాలమైన గదుల అద్దె భవనంలోకి మార్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం.

కూర్చోవడానికి కనీసం కుర్చీలు లేవు : కుమార్, మాజీ ఎంపీటీసీ

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. నూతన భవనం నిర్మించడం సంతోషకరం. కానీ ప్రస్తుతం వైద్య సేవలు ఇరుకు గదుల్లో కొనసాగించడం దురదృష్టకరం. రోగులు కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు. వర్షంలో, ఎండలో నిలబడాల్సిందే. ఎమ్మెల్యే చొరవ చూపి వైద్య సేవలను విశాలమైన గదులలో నిర్వహించాలి.

Advertisement

Next Story

Most Viewed