Bharat - China: సరిహద్దుల్లో అపూర్వ ఘట్టం.. భారత్-చైనా సైన్యాల దీపావళి సంబరాలు

by Y.Nagarani |
Bharat - China: సరిహద్దుల్లో అపూర్వ ఘట్టం.. భారత్-చైనా సైన్యాల దీపావళి సంబరాలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ - చైనా సరిహద్దుల్లో అరుదైన.. అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఇన్నాళ్ల సంఘర్షణలను పక్కన పెట్టి శాంతి ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు దీపావళి (Diwali 2024) సంబరాలు జరుపుకున్నారు. దీపావళి సందర్భంగా గురువారం(అక్టోబర్ 30) ఇరు సేనల నుంచి ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే దిశగా ఎల్ఏసీ దగ్గర గస్తీపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. గత నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఈ ఒప్పందంతో ముగించడంలో భారత్ చైనాలు పెద్ద విజయం సాధించాయి. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్, డెప్సాంగ్ మైదానాలలో చైనా – భారత్ మధ్య రెండు సంఘర్షణ పాయింట్ల వద్ద దళాలను ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయింది. త్వరలో ఈ పాయింట్ల వద్ద సైన్యం పెట్రోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఇరుపక్షాల మధ్య మిఠాయిలు పంచుకున్నట్లు సైన్యం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2020 జూన్‌లో గాల్వన్ వ్యాలీలో చైనా – భారతదేశ సైనికుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణ తర్వాత భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా ఒప్పందంతో సరిహద్దుల వద్ద శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed