మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..అర్హులైనప్పటికీ దక్కని గృహ జ్యోతి ఫలాలు

by Aamani |
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..అర్హులైనప్పటికీ దక్కని గృహ జ్యోతి ఫలాలు
X

దిశ, శంకర్పల్లి : మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ప్పటికీ గృహ జ్యోతి ఫలాలు దక్కకుండా పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా లబ్ధిదారుల నుంచి ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించింది. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో 15 వార్డులకు గాను ఆయా వార్డు కేంద్రాలలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. స్వీకరించిన దరఖాస్తులను మునిసిపల్ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆన్లైన్లో నమోదు చేయడంలో తప్పిదాలు దొర్లడం వల్ల కొంతమంది లబ్ధిదారుల దరఖాస్తులు నమోదు కాకుండా పోయాయి. ప్రజా పాలన దరఖాస్తులో నమోదు కాని వారు తిరిగి నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటర్ లో ప్రజా పాలన రసీదు తో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందజేసినప్పటికీ అప్లికేషన్ నాట్ ఫౌండ్ అనే సమాధానం రావడం తో అర్హులైనప్పటికీ వారికి గృహ జ్యోతి పథకం లో అనర్హులుగానే మిగిలిపోతున్నారు.

శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇలాంటి కేసులు నమోదైన ప్పటికీ మేమేం చేయలేం.. సైట్ ఓపెన్ అయితేనే మేము ఎంట్రీ చేయగలుగుతాం.. అంటూ మున్సిపల్ సిబ్బంది సమాధానాలు చెబుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది చేసిన తప్పుదానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులు అర్హులైనప్పటికీ అవకాశం లేకుండా పోయింది. జనవరిలో దరఖాస్తు చేసుకోగా పది నెలలు గడుస్తున్న సైట్ ఓపెన్ కావడం లేదంటూ సమాధానం చెబుతున్నారు. ఇలాంటి వారు ఎంతోమంది రోజు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న సమస్య తీరడం లేదు. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ సైట్ ఎందుకు ఓపెన్ చేయడం లేదంటూ లబ్ధిదారులు మున్సిపల్ అధికారులను మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు.

దరఖాస్తు చేశా... నా పేరు చూయించడం లేదు : వడ్ల రమేష్ శంకర్పల్లి

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేశా.. రసీదు కూడా ఇచ్చారు. 9 నెలలు అవుతుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగంపై జీరో బిల్లు వస్తుందని చెప్పారు. నేను పేద వాడిని. గృహజ్యోతికి అర్హత ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నా దరఖాస్తు ఫారాన్ని ఆన్లైన్ లో ఎంట్రీ చేయలేదు. ఎప్పుడు అడిగినా సైట్ ఓపెన్ కావడం లేదు. సైట్ ఓపెన్ అయితే నీ దరఖాస్తును ఎంట్రీ చేస్తాం అని చెబుతున్నారు. అధికారులు సిబ్బంది కళ్ళు మూసుకొని మాలాంటి పేదోళ్ల దరఖాస్తులు ఆన్లైన్ లో ఎంట్రీ చేయకపోవడం వల్ల బిల్లు కట్టాల్సి వస్తుంది. మాలాంటోళ్ళ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన లాభం లేకుండా పోయింది.

ఆన్లైన్ సైట్ ఓపెన్ అయితే సమస్య తీరుతుంది : శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ శంకర్పల్లి

శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ని 15 వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. వాటిని ఆన్లైన్ లో ఎంట్రీ చేశారు. కొంతమంది లబ్ధిదారుల దరఖాస్తు ఫారాలు ఎంట్రీ కాలేదు. సైట్ ఓపెన్ అయితేనే మళ్లీ వాటిని ఏంట్రి చేయడం జరుగుతుంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం సైట్ ఓపెన్ చేస్తే సమస్య తీరుతుంది.

Advertisement

Next Story

Most Viewed