రాష్ట్రానికి రూపాయి ఇవ్వని మోడీ దేవుడెట్ల : Sabitha Indra Reddy

by Kalyani |   ( Updated:2023-11-24 13:12:26.0  )
రాష్ట్రానికి రూపాయి ఇవ్వని మోడీ దేవుడెట్ల : Sabitha Indra Reddy
X

దిశ, కందుకూరు: ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీ... అధికారం కోసం ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు నేతలు బారులు తీరారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో తెలంగాణపై విషం చిమ్మే ప్రధాని మోడీ ఏముఖం పెట్టుకొని తెలంగాణలో పర్యటిస్తారని మంత్రి మండిపడ్డారు. శుక్రవారం కందుకూరు మండలంలోని నేదునూరు, దాసర్లపల్లి, సాయి రెడ్డి గూడ, ముచ్చర్ల, దెబ్బడగుడా, కందుకూరు మండల కేంద్రంలో మంత్రి ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి కర్ణాటక ప్రజలు ఓటు వేసి అధికారాన్ని అప్పగిస్తే... అక్కడి ప్రజలకు నరకం కనపడుతుంది అని మంత్రి ఆరోపించారు.

కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అర చేతిలో వైకుంఠం చూపారని, నేడు ఆ పథకాలను అమలు చేయలేక నరకం చూపుతున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఫెయిల్యూర్‌ మోడల్‌ను మెడలో వేసుకుని తెలంగాణకు వస్తున్నారని అట్టి ఒట్టి మాటల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం కర్ణాటక మోడల్ అమలు చేస్తామని చెప్తుంటే నవ్వొస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు గెలిచేవరకు ఒక్క ఛాన్స్‌ చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కబుర్లు చెబుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ముందుగా తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేసి చూపిస్తే బాగుంటుందని ఆమె హితవు పలికారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు డబ్బు సంచులతో గెలవాలని చూస్తున్నారని, వారి ప్రయత్నాలను ప్రజలు వమ్ము చేస్తారని పేర్కొన్నారు. నా వెనుక ఉన్న ప్రజా బలం, బలగం ముందు వారి ఆటలు సాగవని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని, ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో వైపు సందర్భం దొరికిన ప్రతీ సారి తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చిన మోదీ దేవుడని బీజేపీ నాయకులు అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం చేసింది కేసీఆరేనని, ఇకముందు చేయబోయేది కూడా కేసీఆరేనని పేర్కొంటూ మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి

కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు రైతుబంధు, రైతు బీమా కార్యక్రమాల్ని ప్రారంభించి రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతులకు కల్పిస్తున్న బీమా సౌకర్యం మాదిరిగానే ఇతరులకు ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించబోతున్నారని మంత్రి పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలందరికి సన్న బియ్యం అందించబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి పేద మహిళలకు నెలకు రూ. 3000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నామని, అదేవిధంగారూ .400 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. అసరా పెన్షన్ ను రూ . 5016 కు పెంచబోతున్నామని, అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలలో మంత్రి కి ప్రజలు ఘన స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో మీకే మద్దతు గా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story