మంచిరేవుల హ‌త్య కేసును ఛేదించిన పోలీసులు

by Aamani |
మంచిరేవుల హ‌త్య కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ‌,గండిపేట్ : అక్ర‌మ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బ‌లితీసుకుంది. మ‌రో ఇద్ద‌రిని క‌ట‌క‌టాల‌పాలు చేసింది. నార్సింగి ఇన్‌స్పెక్ట‌ర్ హ‌రికృష్ణారెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గోల్కొండ ఛోటా బ‌జార్ ప్రాంతానికి చెందిన స‌య్య‌ద్ హిదాయ‌త్ అలీ (31) సివిల్ ఇంజ‌నీర్‌. దుబాయ్‌లో ఉంటూ ఇంజ‌నీర్‌గా ప‌ని చేస్తున్నాడు. కాగా హిదాయ‌త్ అలీకి గోల్కొండ ఛోటా బ‌జార్‌కు చెందిన సీమాబేగం(24) తో గ‌తంలో అక్ర‌మ సంబంధం ఏర్ప‌డింది. దుబాయ్‌లో ఉన్న హిదాయ‌త్ అలీతో పాటు సీమా బేగం న‌గ‌రంలోని ఫ‌ల‌క్‌నుమా తీగ‌ల‌కుంట ప్రాంతానికి చెందిన స‌య్య‌ద్ అమీర్‌(29)తో ప‌రిచ‌యం ఏర్ప‌డటంతో అతనితో కూడా అక్ర‌మ సంబంధాన్ని కొన‌సాగించింది. ఈ నేప‌థ్యంలో గ‌త నెల దుబాయ్ నుంచి న‌గ‌రానికి వ‌చ్చాడు.

ఈ క్ర‌మంలో దుబాయ్ ఇంజనీర్ హిదాయత్ ఆలీ సీమాబేగాన్ని క‌లువాలంటూ బాగా ఫోర్స్ చేశాడు. దీంతో ఈ విష‌యాన్ని సీమాబేగం అమీర్‌కు తెలుప‌డంతో త‌న‌ను పిలువ‌మ‌ని, పిలిచాక చంపేదామ‌ని ప‌థ‌కం ప‌న్నారు. ఆ ప్ర‌కార‌మే గ‌త నెల 29 వ తేదీన హిదాయ‌త్ అలీ త‌న క్వాలీస్ వాహ‌నం (ఏపీ27ఏడబ్ల్యూ 2772) లో వ‌చ్చి త‌న‌తో పాటు సీమాబేగాన్ని తీసుకెళ్లాడు. నార్సింగి మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్ వ‌ద్ద‌కు వెళ్లారు. వెనుక బైక్‌పై వ‌చ్చిన అమీర్ హిదాయ‌త్ అలీతో గొడ‌వ పెట్టుకున్నాడు. దీంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమీర్ త‌న‌తో తెచ్చుకున్న క‌త్తితో హిదాయ‌త్ అలీ విచ‌క్ష‌ణ ర‌హితంగా పొడిచి హ‌త్య చేశాడు. త‌రువాత అక్క‌డి నుంచి సీమాబేగం, అమీర్‌లు వెళ్లిపోయారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకొని విచార‌ణ చేప‌ట్టగా ఇద్ద‌రు నిందితుల‌ని తేలింది. ఈ మేర‌కు ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Next Story

Most Viewed