బాలాపూర్‌‌లో కుంటలు మాయం​..చుక్క నీళ్లు లేకుండా చేసిన భూ కబ్జాదారులు

by Aamani |   ( Updated:2024-09-02 08:15:10.0  )
బాలాపూర్‌‌లో కుంటలు మాయం​..చుక్క నీళ్లు లేకుండా చేసిన భూ కబ్జాదారులు
X

దిశ, బడంగ్​ పేట్ : ఈ గూగుల్​ శాటిలైట్​ పిక్​ ని చూస్తుంటే ఇది ఏదో బంజారాహిల్స్​... జూబ్లిహిల్స్​ పాష్​ ఏరియా కి సంబంధించిన చిత్రాలు అనుకుంటే పొరపాటే. ఇదంతా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బాలాపూర్​ మండల పరిధిలోని మీర్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ లెనిన్​ నగర్​లోని 30 ఎకరాల తాళ్ల చెరువుకు సంబంధించినది అంటే నమ్మశక్యంగా లేదు ? కదూ? ముమ్మాటికి చుక్కా నీళ్లు లేకుండా ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయం చేసిన తాళ్ల కుంట దీనగాధ ఇది. ఈ తాళ్లకుంటలో గూడు లేని వాళ్లు దశాబ్దాల క్రితం రేకుల ఇళ్లు కట్టుకుని నివసిస్తుసంటే, మరి కొందరు మాత్రం వీరి జోలికి ఎవరూ రావడం లేదని ధైర్యంతో వాటి పక్కనే కమర్షియల్​ కట్టడాలతో పాటు పెద్ద ఎత్తున బహుళ అంతస్థుల భవనాలు నిర్మించారు. ఎవరైనా వస్తే ఆ నిరుపేదలను అధికారుల మీద ఉసిగొలుపి తమ అక్రమ కట్టడాలు సేవ్​ చేసుకోవచ్చనే దిశగా పావులు కదుపుతున్న ట్లు సమాచారం. తాళ్ల కుంట కబ్జాలకు పాల్పడిన ఎంతటివారినైనా వదిలి పెట్టవద్దని, ముందుగా బహుళ అంతస్థుభవనాలు, కమర్షియల్​ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేయాలని చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, స్థానికులు కోరుతున్నారు.


ప్రకంపనలు సృష్టిస్తున్న 'దిశ' దినపత్రిక వరుస కథనాలు..

బాలాపూర్​ మండల పరిధిలో కుంటలు మాయం​ అనే ప్రధాన శీర్షికన దిశ దిన పత్రికలో ప్రచురితమైన వరుస కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం విధితమే. ప్రత్యేకంగా దిశ దినపత్రికలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని స్థానికులు ఇప్పటికే పెద్ద ఎత్తున హైడ్రా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బాలాపూర్​ మండల పరిధిలోని చుక్కా నీళ్లు లేకుండా చేసిన కుంటలలో లెనిన్​నగర్​లోని 30 ఎకరాల విస్తీర్ణం గల తాళ్ల చెరువు ఒకటి అని రికార్డుల వరకే పరిమితమైంది.

వివరాలలోకి వెళితే ... రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బాలాపూర్​ రెవెన్యూ పరిధిలోని మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ లెనిన్​ నగర్​లోని 30 ఎకరాల విస్తీర్ణంలో తాళ్ళచెరువు ఒకప్పుడు ఉండేది. అది కేవలం రికార్డుల వరకే పరిమితమైంది. ప్రస్తుతం చుక్క నీళ్లు లేని ఓ కమర్షియల్​ ఏరియాగా మారిన తాళ్ళచెరువు కు గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు త్రాగడానికి, వ్యవసాయ సాగుకు తాళ్ల కుంట చెరువు నీళ్ళ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బ్రతికాయి. తాళ్ల కుంట ఉంది అనడానికి లెనిన్​ నగర్​ చెరువు కట్ట పైన, కింద ఉన్న అమ్మవారి ఆలయాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గూడు లేని కొంత మంది నిరుపేదలు తాళ్ల కుంటలో దశాబ్దాల క్రితం పెంకులిళ్లు నిర్మించుకుని ఇప్పటికీ నివసిస్తున్నారు. వారిని సాకుగా చూపెట్టి కొంత మంది ప్రజా ప్రతినిధులు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు, కబ్జాదారులు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు హద్దులు నిర్మించుకుని, వెంచర్​ లు చేసి ప్లాట్లుగా విక్రయించుకున్నారు. తక్కువ ధరకు వస్తుందన్న ఆశతో మరి కొంత మంది మిడిల్​ క్లాస్​ కుటుంబాలు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చనే ఆశతో అప్పు చేసి కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారు.


మరి కొంత మంది బడాబాబులు కమర్షియల్ కాంప్లెక్స్ లు కట్టి అద్దెకు ఇచ్చి ప్రతి నెల వేలాది రూపాయలు అప్పనంగా లాగిస్తున్నారు. తాళ్ల చెరువులో కొన్ని ప్రైవేటు​ పాఠశాలలు సైతం నిర్మించారు. అయితే కొంతమంది తాళ్ల కుంట కు సంబంధించిన స్థలంలో అక్రమ కట్టడాలకు మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో అనుమతులు తీసుకుని నిర్మించడం గమనార్హం. ఒక వేళ ఎఫ్​ టి ఎల్​ అయినా కేవలం సాగు చేసుకోవాలే తప్పా వెంచర్​లు చేసి ప్లాట్​లు చేయడం కానీ, ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ అసలు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారన్నది ? మిలియన్​ డాలర్ల ప్రశ్నగా మారింది. తాళ్ళ కుంట కబ్జాకు గురైన 30 ఎకరాల స్థలం ప్రస్తుత మార్కెట్​ విలువ రూ. 600 కోట్లు ఉండవచ్చని పలువురు విశ్లేషకలు భావిస్తున్నారు. అయితే ఇది ఎక్కువగా గడిచిన 15ఏళ్లలోనే ఎక్కువగా అక్రమ కట్టడాలు చేపట్టారని, ఇటీవల కూడా ఇంకా అక్రమ నిర్మాణాలు యధేచ్చగా జరుగుతూనే ఉన్నాయని చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆరోపించారు. తాళ్లకుంటలో చుక్క నీళ్ళు లేకుండా చేసిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చెరువుల పరిరక్షణ సమితి డిమాండ్​ చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed