దోస్తులకు దోచి పెట్టేవిధంగా మోడీ పరిపాలన ఉంది: కేటీఆర్

by S Gopi |
దోస్తులకు దోచి పెట్టేవిధంగా మోడీ పరిపాలన ఉంది: కేటీఆర్
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రతి చిన్న అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ బీజేపీ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక చెప్పిన ఒక్క హామీ నెరవేర్చలేదని, పైగా పేదలను ధనవంతులను చేస్తారని నమ్మించారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(బంటి) చేపట్టిన ప్రగతి నివేదన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 63 రోజులు 95 గ్రామాలలో పర్యటిస్తూ 771 కిలోమీటర్లు బంటి తిరిగి ప్రజల ఆధారాభిమానులను చూరగోన్నారని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మంచిరెడ్డి బంటి తన వంతు ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్ పాలన దేశానికి పాఠాలు చెప్పే విధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన ఉత్తమ గ్రామపంచాయతీలో 19 గ్రామ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని, అదేవిధంగా 27 మున్సిపాలిటీలు ఉత్తమ మున్సిపాలిటీలుగా అవార్డులు పొందాయని స్పష్టం చేశారు. 200 ఎకరాల్లో నియోజకవర్గంలో ఫోక్స్కాన్ కంపెనీ పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వచ్చిందని, దీంతో కొత్తగా లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు.

రూ. 65 వేల కోట్లతో రైతుబంధు అమలు చేస్తూ తొందరలో నూతన పథకంతో గృహలక్ష్మి అనే పేరిట నియోజకవర్గానికి 3,000 మంది చొప్పున ఇల్లు కట్టించేందుకు ప్రోత్సాహం అందించనున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్క ఛాన్స్ కావాలంటూ పదవి కోసం ఆరటపడుతున్నారని దీన్ని ప్రజలు గమనించాలని అన్నారు. ఎందుకంటే గతంలో 10 ఛాన్సులు ఇచ్చినా ప్రజల ఆశలు నీరుగార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధిని గుర్తించాలన్నారు. దోస్తులకు దోచి పెట్టే విధంగా మోడీ పరిపాలన ఉందని, 9 సంవత్సరాల అయినప్పటికీ పీఎం హోదాలో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాకుండా ఉన్న ప్రధాని మోడీ అన్నారు. మాటలు కోట్లలో చేతలు పుట్నాల పకోడీ లాగా ఉన్నాయన్నారు. తెలంగాణలో జరిగిన ఉద్యోగాలు ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. ఇటీవల రచ్చకెక్కిన టీఎస్పీఎస్సీ లీకేజీల కారణమైన వ్యక్తులను అరెస్టు చేశామని వెంటనే పరీక్షలు రద్దు చేశామని ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏముందో వివరించాలన్నారు. లీకేజీ అయినా టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంటుందని దాన్ని ప్రభుత్వానికి రుద్దడం ఎంతవరకు సమంజసం అన్నారు. అయినప్పటికీ యువతకు జరిగిన నష్టానికి చింతిస్తూ తాము చేయాల్సిన పని చేశామన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటారనే కారణంతో నిరుద్యోగ దీక్ష పేరిట బీజేపీ కుట్రలు పన్నుతున్నారని, ఇటువంటి కుట్రలను యువత తిప్పి కొట్టాలన్నారు.

అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ బంటి చేపట్టిన పాదయాత్రతో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. చేసింది ఎంత ఉన్నప్పటికీ చేయాల్సింది కూడా ఉందని అందులో భాగంగా 10 ముఖ్యమైన అంశాలను బంటి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారన్నారు. గడిచిన 8 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 2391 కోట్ల అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. రూ. 4 కోట్లతో పెద్ద అంబర్ పేట్ నుంచి పసుమములకు డబుల్ రోడ్డు, ట్రంక్ లైను, నాలుగు మున్సిపాలిటీలకు రూ. 10 కోట్ల చొప్పున అభివృద్ధికి నిధులు కేటాయించుకునే అంశాల వంటి పలు అంశాలను గుర్తుచేశారు.

అనంతరం పాదయాత్ర నిర్వహించిన బంటి మాట్లాడుతూ పాదయాత్రతో తనకు ఎంతో అనుభవం వచ్చిందని, ఈ యాత్ర ఎంతో నేర్పిందని అన్నారు. యాత్రలో తాను తన దృష్టికి వచ్చిన సమస్యలన్నిటినీ నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందజేస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇందులో భాగంగా బండ రావిరాల చుట్టుపక్కల ఉన్న రైతుల సమస్యలు అయినటువంటి మైనింగ్ సమస్యలను వచ్చే యాబై ఒక్క రోజుల్లో పరిష్కరించకుంటే తాను రైతులతో పాటు దీక్ష చేస్తానని రైతులకు హామీ ఇచ్చాను అన్నారు. కొత్తపెళ్లి గ్రామంలో బోక్కల కంపెనీతో స్థానికులు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ద్వారా అసెంబ్లీలో చర్చించి బొక్కల కంపెనీ మూసేసించామని అన్నారు. రాజకీయాలలో ఉన్న లేకున్నా సేవే లక్ష్యంగా తన ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. తాను తన తండ్రి ఆశలకి కాకుండా ఆశలకు కూడా వారసునిగా ఉన్నానన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, రమణ పలుశాకల చైర్మన్లు సాయిచంద్, సతీష్ రెడ్డి జెడ్పి చైర్మన్ తీగల అనిత రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, పెద్ద అంబర్ పేట మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధంకి కృష్ణారెడ్డి, నాయకులు కళ్లెం ప్రభాకర్ రెడ్డి, బలరాం దామోదర్, కౌన్సిలర్లు, మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed