ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా గుబులు

by Mahesh |
ఆక్రమణదారుల గుండెల్లో హైడ్రా గుబులు
X

దిశ‌, గండిపేట్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్రమ నిర్మాణాల‌ను కూల్చివేయాల‌నే సంక‌ల్పంతో ఏర్పాటు చేసిన హైడ్రా సెగ గండిపేట్‌కు త‌గిలింది. గండిపేట్ మండ‌ల ప‌రిధిలో అక్రమంగా చేప‌ట్టిన నిర్మాణాల‌పై హైడ్రా క‌న్ను ప‌డింది. అక్రమ నిర్మాణాల‌ను గుర్తించి కూల్చివేత‌ల ప్రక్రియ‌ మొదలు పెట్టింది. చోటామోటా నాయ‌కులు అక్రమ నిర్మాణాల‌కు పాల్పడితే గ‌త ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొర‌వ‌తో ఏర్పాటుచేసిన హైడ్రా ఈ అక్రమ నిర్మాణాల‌ను ఉక్కుపాదం మోపి నేల‌మ‌ట్టం చేస్తున్నాయి. అందులో భాగంగా ఆదివారం గండిపేట్ చెరువు ఖానాపూర్‌లో ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల ప‌రిధిలోని స‌ర్వే నంబ‌ర్ 233/2 లో నిర్మించిన ప్రహరీలు, స‌ర్వే నంబ‌ర్ 246 స‌ర్వే నంబ‌ర్ ఓఆర్వో స్పోర్ట్స్‌లో నిర్మాణాలు, నార్సింగి మున్సిపాలిటీ ప‌రిధిలోని గండిపేట్ చెరువులోని స‌ర్వే నంబ‌ర్ 63లో అక్రమ నిర్మాణాలు, ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని పాల‌మూరు గ్లో హోట‌ల్ నిర్మాణం పూర్తికాక ముందే అధికారులు కూల్చివేశారు.

స‌ర్వే నంబ‌ర్ 246లో అక్రమ నిర్మాణంపై ఓ మ‌హిళ ఎన్‌జీటీ కింద కోర్టును ఆశ్రయించిన‌ట్లు విశ్వస‌నీయ‌ స‌మాచారం. ఉద‌యం నుంచే టౌన్‌ప్లానింగ్‌, ఇరిగేష‌న్‌, జ‌ల‌మండ‌లి అధికారులు కూల్చివేత‌లు చేప‌ట్టగా పోలీస్ శాఖ భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేసింది. దీంతో నిర్మాణ‌దారులు హైడ్రా అధికారుల‌తో వాద‌న‌కు దిగినా వారిని లెక్క చేయ‌కుండా కూల్చివేత‌ల ప్రక్రియ‌ను నిర్వహించారు. గండిపేట్ మండ‌ల ప‌రిధిలో గ‌త ప్రభుత్వ హ‌యాంలో అడ్డగోలుగా నిర్మాణాల‌ను చేప‌ట్టారు. ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్లు, ఎండోమెంట్‌, పార్కు స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, చెరువు, నాలాలు క‌బ్జాలు చేప‌ట్టి నిర్మాణాలు చేప‌ట్టే వారు. అయినా నాటి ప్రభుత్వంలో ఎవ‌రూ ప్రశ్నించ‌క‌పోవ‌డంతో నిర్మాణాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేప‌ట్టేవారు. కానీ హైడ్రాను ఏర్పాటు చేసి కూల్చివేత‌లు చేప‌ట్టడంతో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు చేప‌ట్టే వారి గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. హైడ్రా అధికారులు ఎప్పుడు వ‌చ్చి త‌మ నిర్మాణాల‌ను కూల్చివేస్తారోన‌ని కునుకు ప‌ట్టడం లేద‌ని అక్రమ నిర్మాణ‌దారులు ఆందోళ‌న చెందుతున్నారు.

గ‌త ప్రభుత్వ హ‌యాంలో..

గ‌త ప్రభుత్వ హ‌యాంలో అక్రమ నిర్మాణాల‌కు అడ్డు చెప్పిన వారు లేక‌పోవ‌డంతో అడ్డగోలుగా నిర్మాణాలను చేప‌ట్టారు. ఏకంగా పార్కు స్థలాలు, ఎండోమెంట్, చెరువులు, కుంట‌లు, నాలాలు, రోడ్లను క‌బ్జాలు చేసి నిర్మాణాలు చేశారు. వీటికి ఎలాంటి అనుమ‌తులు తీసుకోక‌పోవ‌డ‌మే కాకుండా వాటిని పూర్తి చేసి క్రయ విక్రయాలు సైతం చేశారు. గ‌త ప్రభుత్వం నిర్మాణాలకు ఇష్టానుసారంగా అనుమ‌తులు ఇస్తూ వ‌చ్చింది. ఎలాంటి విచార‌ణ, ప‌రిశీల‌న లేకుండా ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్లలో అనుమ‌తులు ఇవ్వడం, చెరువులు, కుంటల్లోనూ అనుమ‌తులు ఇచ్చి చేతులు దులుపేసుకున్నది. కోట్లల్లో బిజినెస్ జ‌రుగుతుండ‌డంతో కొంద‌రు అధికారులు, ప్రజా ప్రతినిధులు చూసీ చూడ‌న‌ట్లుగా పోయినందుకే నాటి ప్రభుత్వ హ‌యాంలో సాఫీగా అక్ర‌మ నిర్మాణాలు కొన‌సాగేవి. ప‌ర్యావ‌సానంగా చెరువులు, కుంట‌లు క‌బ్జాల‌కు గురి కావ‌డంతో వ‌ర్షాలు కురిసిన‌ప్పుడు ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. నాటి ప్ర‌భుత్వం అక్ర‌మ నిర్మాణాల‌కు ఎర్ర తివాచీ ప‌రిచింద‌ని, నేటి ప్ర‌భుత్వ ఆ నిర్మాణాల‌ను కూల్చివేస్తుంద‌ని అక్రమ నిర్మాణదారులు ఆందోళ‌న చెందుతున్న‌ట్లు గోచ‌రిస్తుంది.

హైడ్రా ఏర్పాటుతో..

గ‌త ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించ‌క‌పోవ‌డంతో ధైర్యంగా ఉన్న నిర్మాణ‌దారుల‌కు కొత్తగా కొలువుదీరిన‌ కాంగ్రెస్ ప్రభుత్వ హ‌యాంలో చిక్కులు మొద‌ల‌య్యాయి. అక్రమ నిర్మాణాల‌ను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా పేరుతో అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి న‌గ‌రాన్ని జ‌ల్లెడ ప‌ట్టడం మొదలుపెట్టారు. అందులో భాగంగా గండిపేట్ మండ‌ల ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాల‌పైనా దృష్టి కేంద్రీక‌రించారు. అందులో భాగంగా ఆదివారం ప‌లు నిర్మాణాల‌పై అధికారులు చ‌ర్యలు తీసుకున్నారు. ఇంకా ఎన్ని అక్రమ నిర్మాణాల‌ను గుర్తిస్తారో, ఎన్ని నిర్మాణాల‌ను కూల్చివేస్తారో అనే ఆందోళ‌నలు స్థానికంగా వ్యక్తమ‌వుతున్నాయి. హైడ్రా ఏర్పాటుతో నిర్మాణ‌దారుల వెన్నులో వ‌ణుకు పుడుతున్నది.

Advertisement

Next Story

Most Viewed