ప్రజాప్రతినిధులకు సైతం పాలుపంచాల్సిందే..

by Sumithra |   ( Updated:2022-10-21 10:55:27.0  )
ప్రజాప్రతినిధులకు సైతం పాలుపంచాల్సిందే..
X

దిశ, అబ్ధుల్లాపూర్ మెట్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపాల్టీలో ఇంజనీరింగ్ సెక్షన్ కమీషన్ల పర్వం జోరందుకుంది. కాంట్రాక్టర్లు చేసిన పనులకు సదరు అధికారులకు, సిబ్బందికి కమీషన్లు ఇవ్వకుంటే ఎక్కడి ఫైల్ అక్కడే ఉండాల్సిందే. చిన్న పనికి సైతం పర్సంటేజీల రూపంలో వసూలు చేస్తుండడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కమీషన్ల మత్తులో పనులు సైతం నాణ్యతగా ఉన్నాయా లేదా అన్న అంశాలను కూడా పట్టించుకోవడం లేదు.

ఇటీవల ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటల్లో 20లక్షల పనిని దక్కించుకునేందుకు దాదాపు ముప్పై శాతం తక్కువ కొటేషన్ వేసి పనులు దక్కించుకున్నారు. జీఎస్టీ, టీడీఎస్, ఇతర కటింగులు పోనూ 12 లక్షల వరకు పనులు చేయాల్సింది. దాదాపు కార్యాలయంలో అధికారులకు, సిబ్బందికి కలిపి 15 శాతం వివిధ స్థాయిలలో ఇవ్వాల్సిందే. కొంతమంది ప్రజాప్రతినిధులకు మూడు నుంచి నాలుగు శాతం పక్కాగా వెళ్లాల్సిందే. అంటే 12 లక్షలలో 19 శాతం అంటే సుమారు రెండు లక్షల 30 వేలు అప్పజెప్పాల్సిందే.

మిగిలిన తొమ్మిది లక్షలలో ఇక నాణ్యతగా పనులేమి అవుతాయో ఇట్టే అర్ధం అవుతుంది. సర్లే ప్రజల బాగోగులు దృష్ట్యా నాణ్యతగా పనులు చేసి బిల్లులు తీసుకుందామంటే అది అంతా ఈజీ కాదు. పై అధికారులు సిబ్బందిలో ఎక్కడ కమీషన్ ముట్టకపొయినా ఫైల్ పెండింగ్ ఉండాల్సిందే. చేసిన పనులకు బిల్లులు రాక కొత్త పనులు చేయలేక కాంట్రాక్టలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఎవరి పైన అయినా ఫిర్యాదులు చేద్దామంటే అంతకు మించిన అమాయకత్వం మరోటి లేదు. ఎవరికి చెప్పుకోలేక, చేసేది లేకా కాంట్రాక్టర్ల అవస్థలు చెప్పలేకుండా ఉన్నాయి.

గత కౌన్సిల్లో ఉన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు పత్తాకూడా లేరు. ఇప్పుడు వచ్చిన కాంట్రాక్టర్లు రెండొ పనికి ముందుకు రావడం లేదు. కొంత మంది ఆన్లైన్లో పనులు దక్కించుకుని కార్యాలయ పరిస్థితి గమనించి పనులు చేయలేమని విత్ డ్రా అవుతున్న పరిస్థితులు అనేకం. మున్సిపాల్టీలో ప్రతి నెల సుమారు 80లక్షల నుంచి కోటి రూపాయల వరకు పనులు జరుగుతున్నాయి. అంటే 18లక్షల వరకు వివిధ రూపాయల్లో కమీషన్లు వెలుతున్నాయి.

ఆ అధికారి స్టైలే వేరు...

మున్సిపాల్టీలో ఓ అధికారి తన స్టైల్ ను ఇష్టానుసారంగా ప్రదర్శిస్తారు. ఇక్కడ డిప్యుటేషన్ మీద వారానికి మూడు రోజులే పని చేస్తారు. ఆ మూడు రోజులలో కూడా కార్యాలయానికి వచ్చేది 12 "గంటల తర్వాతనే. వచ్చిన అనంతరం అయినా పనులు సాఫీగా సాగిస్తారా అంటే ముందు కాంట్రాక్టర్ల పనులు ఎక్కడ, ఎందుకు పని చేస్తున్నారో తెలుసుకుని వారి బిల్లుల వివరాలు సిబ్బందితో ఆరా తీస్తారు. తన టేబుల్ మీదకు వచ్చిందంటే మినిమం రెండు శాతం ఇవ్వాల్సిందే. లేదంటే వివిధ కారణాలతో కాంట్రాక్టర్ను నానా అవస్థలు పెట్టాల్సిందే. అంటే సదరు అధికారికి సుమారు నెలకు రెండు లక్షల వరకు వెళ్లాల్సిందే.

వారాంతం పని చేసిన అధికారులు ఒకింత అభిమానంతో చూసిచూడనట్లు వ్యవహరించి పనులలో ముందుకు వెళ్తారు. కాని సదరు అధికారి కమీషన్ల విషయంలో ససేమిరా అంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. కింది స్థాయి సిబ్బంది సైతం ఈ విషయంలో గ్గగోలు పెడుతున్నారు. పనులు మొదటి నుంచి చివరి వరకు చేసే వారు చివరి సంతకం చేసి రికార్డు చేసే అధికారికి రెండు శాతం ఇవ్వడంలో తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. రాత్రంతా కూర్చుని ఎంబీలు, ఇతరాత్ర కార్యాలయ పనులు చేసే వారికన్నా రికార్డులు రాసి ఇచ్చే వారి పరిస్థితి బావుందని పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా అధికారి వసూలు చేస్తున్న విషయంలో కాంట్రాక్టర్లు పడుతున్న అవస్థలు అన్ని ఇన్నీ కావు.

ఆ ప్రజాప్రతినిధి రూటే సప"రేటు"....?

మున్సిపాల్టీలో ఓ ఉన్నత ప్రజాప్రతినిధి రూటే సపరేటుగా ఉంది. ఎవరు పనులు దక్కించుకున్నా అక్కర్లేదు, నాణ్యత అంశాలు అవసరం లేదు. కాని తనకు రావాల్సిన రెండు శాతం మాత్రం ముక్కు పిండి అయినా ఇవ్వాల్సిందే అని బెదిరిస్తున్నారు. కాంట్రాక్టర్లను బెదిరించినా వారు వారి ఇష్టం కాని కాంట్రాక్టర్లు చేసిన పనికి కంప్యూటర్లో రికార్డులు రాసే సిబ్బందికి హుకుం జారి చేయడంలో సదరు ప్రజాప్రజాప్రతినిధి వ్యవహరిస్తున్న తీరిది. తనకేం సంబంధం లేదని సదరు సిబ్బంది గగ్గోలు పెడితే పనులు నిలిపి వేయాలని లేదంటే సెక్షన్ నుంచి బదిలీ చేస్తానంటూ తన పరిధి దాటి మరీ ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం.

ఎక్కడన్నా కాంట్రాక్టర్లు మొండిగా వ్యవహరిస్తే సదరు కాంట్రాక్ట్ పనులను పలుమార్లు అధికారులతో కలిసి పరిశీలన చేయడం ఇక్కడ పరిపాటు. అధికారులు సైతం ప్రజాప్రతినిధులు చెప్పినట్లుగా వ్యవహరించడంలో చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మున్సిపాల్టీలో జరిగే పనులతో సదరు ప్రజాప్రతినిధి ఆదాయం అక్షరాల రెండు లక్షల పైమాటే. ఈ విధంగా కమీషన్ల పర్వంలో పెద్దఅంబర్ పేట మున్సిపాల్టీ తన జోరును ప్రదర్శిస్తుంది. సంబంధిత ఉన్నతాధికారులు, ఉన్నత ప్రజా ప్రతినిధులు స్పదించి కమీషన్ల జాతరను అడ్డుకుని పనుల విషయంలో నాణ్యతను పక్కాగా చేయించడంలో ముందుండాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story