తాండూరు పట్టణంలోని కబ్జాలను తొలగిస్తాం : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

by Nagam Mallesh |   ( Updated:2024-09-02 11:50:20.0  )
తాండూరు పట్టణంలోని కబ్జాలను తొలగిస్తాం : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
X

దిశ, తాండూరు : త్వరలోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటుచేసి పట్టణంలో ఉన్న కబ్జాలన్నీ తొలగిస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, తులసి నగర్, పాతకుంట, మార్కేండేయ కాలనీతో పాటు పలు లోతట్టు ప్రాంతాలను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాల వల్ల ఎవరికైనా ఇబ్బందులు తలెత్తుతే తక్షణ సహాయం కోసం అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కుంటలు, వాగులు, చెరువులు అలుగులు పారుతున్నాయని ముంపు ప్రాంతాల్లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరికైనా అత్యవసరంగా అధికారులను సంప్రదిస్తే పునరావాసం ఏర్పాటు చేస్తారన్నారు.

మున్సిపల్ పరిధిలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో ప్రజలకు ఇబ్బందులు పడ్డారన్నారు. పలు ప్రాంతాల్లో నాలాలు కబ్జాకు గురి అవ్వడంతో సమస్య తీవ్రంగా అయిందని, కబ్జాలకు గురైన ప్రాంతాలను రక్షిస్తామన్నారు. దీనికోసం త్వరలోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని కబ్జాలన్నీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. పలు కాలనీలకు డ్రైనేజీ, రోడ్లు అవసరం ఉందని త్వరలోనే అన్ని కూడ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వాగుల వద్ద బ్యారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికప్పుడు మున్సిపల్, గ్రామస్థాయిలో అధికారులు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరదలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమిళ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి , వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు,తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed