మార్చిలోపు ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి

by Sumithra |
మార్చిలోపు ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : జాతీయ ఉపాధి హామీ కింద చేపట్టవలసిన రూ.60 కోట్ల పనులను మార్చి లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతీయ ఉపాధి హామీ పనులు, మనఊరు మనబడి, అటెండెన్స్ యాప్ పని తీరుపై జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్స్, వివిధ శాఖల ఇంజనీర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం 40 రోజులే ఉన్నందున జాతీయ ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న వివిధ పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని తెలిపారు.

మార్చి 15 లోపు ఎఫ్టీఓ జనరేట్ చేసి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన పనులను సకాలంలో పూర్తిచేయనట్లయితే నిధులు రద్దు అవుతాయని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలను సాంకేతిక పరంగా ఎటువంటి లోపాలు లేకుండా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మన ఊరు మనబడి కింద చేపట్టే పనులను కూడా వేగవంతం చేయాలని సంబంధిత ఇంజనీర్లను కలెక్టర్ ఆదేశించారు. మొదటి విడతలో ఎంపిక చేయబడ్డ పాఠశాలలన్నీ మార్చి 16 వరకు అన్ని పనులు పూర్తి చేసి 31 వరకు పాఠశాలలో ప్రారంభోత్సవాలు కావాలని కలెక్టర్ తెలిపారు.

పాఠశాలల్లో 12 విధాల పనులకు సంబంధించి ఏఏ దశలో ఉన్నాయో శుక్రవారం వరకు పూర్తిసమాచారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అటెండెన్స్ యాప్ లో హాజరు లేకుంటే వేతనాలు ఇవ్వబడవని కలెక్టర్ తెలిపారు. ప్రతిఉద్యోగి అటెండెన్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, శాఖల వారీగా ఎంతమంది యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని కలెక్టర్ ఆరా తీశారు. ఎంపీడీవోలు యాప్ లో ఉద్యోగులందరూ ఉండేలా బాధ్యత తీసుకొని పని చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్డీఓ కృష్ణన్, డీపీఓ తరుణ్ కుమార్, డీఈఓ రేణుకాదేవి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ లాల్ సింగ్, ఇరిగేషన్ ఈఈ రేణుక, టీఎస్ఈడబ్ల్యుఐడీసీ డీఈ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story