ఆ ఒక్కటి లేక “మహిళల” అవస్థలు

by Kalyani |
ఆ ఒక్కటి లేక “మహిళల” అవస్థలు
X

దిశ,కేశంపేట: అటు ఉద్యోగాల్లో.. ఇటు వ్యాపారాల్లో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో అడుగులు వేస్తున్న మహిళలు పలు సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలకు పలు అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ఆడపడుచులకు ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది. అన్నిరకాలుగా అభివృద్ది చెందుతున్న మండల కేంద్రంలో అవసరానికి ఆ ఒక్కటి కనిపించకపోవడంతో ఎటూ పాలుపోక తిట్టుకుంటూ గ్రామాలకు తిరుగు ప్రయాణం కొనసాగిస్తున్నారు. పారిశుధ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్న మాటలు, చేతలకు ఎలాంటి పొంతన లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు.

మండలంలో పరిస్థితి దారుణం...

షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండల కేంద్రంకు ప్రతినిత్యం అనేక పనుల నిమిత్తం ఎంతో మంది వస్తుంటారు. గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు, వ్యాపారులు, అవసరాల నిమిత్తం అడపాదడపా మండల కేంద్రంలో ఉన్న బ్యాంకులకు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలను సబ్ రిజస్ట్రార్ కార్యాలయం లుగా మార్చి రిజిస్ట్రేషన్ లు కొనసాగిస్తోంది. మరో పక్క మండల కేంద్రంలో నిర్వహించే వారాంతపు సంతలకు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి క్రయవిక్రయాలు నిర్వహిస్తుంటారు. దాంతో గంటల తరబడి అక్కడే ఉండాల్సి ఉంటుంది. మండలకేంద్రంలో ఎక్కడా ప్రజా మరుగుదొడ్లను అధికారులు ఏర్పాటు చేయలేదు.

రిజిస్ట్రేషన్ లకోసం ఎంతో మంది ప్రతినిత్యం వస్తున్న టాయిలెట్స్, మరుగుదొడ్లు మాత్రం లేవు. దీంతో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని, మరుగుదొడ్లు లేకపోవడం బాధాకరమని విమర్శిస్తున్నారు. కేశంపేట మండలంలో దాదాపు 22వేల మంది పురుషులు, 21వేల మంది స్త్రీలు ఉన్నారు. గతంలో ఉపాధి హామీ పథకం కింద మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఎక్కడా సర్పంచులు, అధికారులు నిర్మాణాలకు ముందుకు రాలేదు. దీంతో ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. మండల కేంద్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మండలకేంద్రంలో ప్రజామరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

త్వరలోనే పనులు ప్రారంభిస్తాం : నర్సింగ్ రావు,పీఆర్ ఏఈ,కేశంపేట

మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు మంజూరు అయినది. అందుకు సంబంధించిన మెటీరియల్ కూడా వేయించారు. గతంలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు ప్రారంభం కాలేదని తెలిసింది.నేను నూతనంగా మండలానికి బదిలీ పై వచ్చాను. త్వరలోనే పనులు ప్రారంభం అయ్యేలా చూస్తాను.

Advertisement

Next Story

Most Viewed