నమస్తే తెలంగాణ ప్రతులను దగ్ధం చేసిన సీపీఐ నాయకులు

by Aamani |
నమస్తే తెలంగాణ ప్రతులను దగ్ధం చేసిన సీపీఐ నాయకులు
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : నమస్తే తెలంగాణ పత్రికలో గత శుక్రవారం రాసిన కల్పిత రాతలకు నిరసనగా శనివారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పాపాయిగూడ భూదాన్ భూమి నివసిత గుడిసె వాసుల సమక్షంలో నమస్తే తెలంగాణ వార్త ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజ్ రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి లు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఇల్లు లేని నిరుపేదల కోసం ఇక్కడ ఉన్న భూదాన భూముల్లో గుడిసెలు వేసి నీతి నిజాయితీని కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని అహర్నిశలు భూపోరాటం నిర్వహిస్తున్న సీపీఐ నాయకుల పైన, పేదవారి గుడిసెల పైన, ఇక్కడ స్వచ్ఛందంగా పని చేస్తున్న వాలంటీర్లపైన అవాస్తవ కథనం ‘వెయ్యి రూపాయలకు చదరపు గజం భూమి’ అంటూ వార్త రాసినందుకు నమస్తే తెలంగాణ యాజమాన్యం సిగ్గుపడాలని, నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు, గుడిసె వాసులకు పేదలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గత ఆరు సంవత్సరాల క్రితం కెసీఆర్ కాలనీ పేరుతో బీఆర్ఎస్ నాయకులు భూస్వాములు భూదానం ఫేక్ ప్రొసీడింగ్ లతో పేద మధ్యతరగతి ప్రజలను తప్పుదోవ పట్టించి మోసపూరితంగా కోట్లాది రూపాయలను వ్యాపారం చేసిన చరిత్ర మీది మీ పత్రికది కాదా అని విమర్శించారు. కొంతమంది భూస్వాములకు కొమ్ము కాస్తూ నిలువ నీడలేని వేలాది పేదవారికి అన్యాయం చేసేలా వార్తలు రాయటం సిగ్గుచేటని, జర్నలిజం విలువలు దిగజార్చడమేనని దుయ్యబట్టారు, గత 18 నెల నుండి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ గుడిసెల సముదాయం వలన ఎలాంటి క్రైమ్ రికార్డు కాలేదని, శాంతి భద్రతలకు ఎలాంటి భంగం చేకూర్చలేదనే విషయాన్ని మీ అబద్దపు పత్రిక గుర్తు చేసుకోవాలని, దొంగలకు సద్దులు కట్టేది మీరు అని ఘాటు విమర్శ చేశారు.

ఈ శీర్షిక వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయని, వార్త రాసిన సిటీ బ్యూరో రిపోర్టర్ల పై యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో మీ కార్యాలయం ముందు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్ రెడ్డి, స్థానిక పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, జిల్లా నాయకులు అజ్మీర్ హరిసింగ్ నాయక్, నాయకులు యేశాల నర్సింహా, పొన్నాల యాదగిరి, నవనీత, అరుణ, నిరంజన్,పుల్లయ్య, సక్రు నాయక్, దేవమ్మ, మధు, వినోద్, యాదగిరి,నారాయణ, శ్రీదేవి నాగరాజు, దాసరి ప్రసాద్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed