ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనమా ? పశువుల పాకనా ?

by Sumithra |
ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనమా ? పశువుల పాకనా ?
X

దిశ, ఆమనగల్లు : సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల చదువుల కోసం పోరాటం కొనసాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జూనియర్ కళాశాల విద్యార్థుల కష్టాలు తీరడం లేదు. ఆమనగల్లు, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ నాలుగు మండలాలకు కూడలి అయిన ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సొంత భవనం లేక పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పై చదువుల కొరకు హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అనేక పోరాటాల అనంతరం 2001 లో ఆమనగల్లుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు కాగా, సొంత భవనం లేక బాలుర ఉన్నత పాఠశాలలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న జూనియర్ కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మాడుగుల రోడ్డులో 9.15 ఎకరాల భూమిలో రెండు కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. అసంపూర్తిగా నిలిచిపోవడంతో భవనంలో ప్రతినిత్యం అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా పలువురు ఎంచుకున్నారు.

కళాశాల నూతన భవనమా.. పశువుల పాకనా..?

వేలాది మంది విద్యార్థుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలిచినట్లు గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ నూతన భవనంలో ఒకవైపు ఏకంగా పశువులపాకనే ఏర్పాటు చేసి దర్జాగా పశువులను మేపుతున్నారు.

వచ్చే విద్యా సంవత్సరానికి నూతన భవనం ప్రారంభం అయ్యేనా గత 23 సంవత్సరాలుగా నూతన కళాశాల భవనం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడేది ఎప్పుడు అని తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ఆమనగల్లు కేంద్రంలో విద్యారంగం పై ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 23 సంవత్సరాలుగా ఇంటర్ విద్యార్థుల చదువులు చెట్ల కింద కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో ప్రారంభమయ్యే వచ్చే విద్యా సంవత్సరం 2025 - 2026 వరకైనా నూతన కళాశాల భవనంలో తరగతులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed