రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటాపోటీగా బీజేపీ, టీఆర్ఎస్‌లు..?

by Sumithra |
రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటాపోటీగా బీజేపీ, టీఆర్ఎస్‌లు..?
X

దిశ‌, గండిపేట్ : మొద‌టి వ‌రుస‌లో ఉండే నియోజ‌క‌వ‌ర్గం రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం. నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో కీల‌క‌మైన జాతీయ సంస్థ‌లు, శంషాబాద్ విమానాశ్ర‌యం ఇట్టే గుర్తొస్తుంది. నియోజ‌క‌వ‌ర్గం వాతావ‌ర‌ణం ఎంత ఆహ్ల‌ద‌క‌రంగా ఉంటుందో రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం రాజకీయం అంత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంది. ఈ విష‌యం రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌ట్ల క‌నీస అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మ‌వుతుంది. నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డి సుమారు ప‌దిహేనేళ్లు కావ‌స్తుంది. రాజ‌కీయంగానూ ఎంతో ప‌టిష్టంగా ఉంటుంది.

రాజకీయంగా నిత్యం ఉండే ముగ్గురు ప్ర‌త్య‌ర్థుల‌తో పాటు మ‌రో ప్ర‌త్య‌ర్థి అయిన ఎంఐఎం కూడా ఇక్క‌డ గ‌ట్టి స‌వాల్‌ను విసురుతూనే ఉంటుంది. రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా ఎమ్మెల్యే ప్ర‌కాష్‌గౌడ్ త‌న‌దైన మార్క్‌తో గెలుపొందుతూ వ‌స్తున్నారు. గ‌త 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున‌, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున‌, 2018 సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున త‌న‌దైన మార్క్‌తో గెలుపొందారు. నియోజ‌క‌వ‌ర్గం విస్తీర్ణం, జ‌నాభా ప‌రంగా విశాల‌మైంది. ఇక్క‌డ స్వ‌రాష్ట్ర ప్ర‌జ‌లే కాకుండా ప‌లు రాష్ట్రాల ప్ర‌జ‌లు జీవ‌నోపాధి కోసం వ‌చ్చి జీవ‌నం సాగిస్తుంటారు. ఇందులో ఇత‌ర రాష్ట్రాల నుంచి ఇక్క‌డే స్థిర‌ప‌డిన ఓట‌ర్లు ఎంతో కీల‌కం.

హ్యాట్రిక్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ ఎమ్మెల్యే ప్ర‌కాష్‌గౌడ్‌...

రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌కాష్‌గౌడ్ ఎమ్మెల్యేగా మూడు ద‌ఫాలుగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఈ సారి సైతం ప్ర‌కాష్‌గౌడ్ ఎమ్మెల్యే బ‌రిలో టీఆర్ఎస్ త‌ర‌పున నిలిచి స‌త్తాచాటాల‌ని చూస్తున్నారు. కానీ స్థానికంగా ప్ర‌కాష్‌గౌడ్ అనుకూల‌త‌ల‌తో చిన్న‌పాటి ప్ర‌తికూల‌త‌ల‌ను నెట్టుకొని రావాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని రాజ‌కీయ పండితుల విశ్లేష‌ణ‌. ప్ర‌ధానంగా శంషాబాద్ పార్టీలో కీల‌కంగా ప‌ని చేస్తున్న కొంద‌రు టీఆర్ఎస్ నాయ‌కులు ఎమ్మెల్యేకు కాస్త ఇబ్బందులు సృష్టించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని ప‌లువురు సంభాషించుకుంటున్నారు. ఇక రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్లోనూ ఎమ్మెల్యే ప్ర‌కాష్‌గౌడ్ వెనుక న‌డిచే కేడ‌ర్ అలాగే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి దుస్సాహ‌సం ఎవ‌రూ చేయ‌క‌పోవ‌డం ప్ర‌కాష్‌గౌడ్‌కు క‌లిసొచ్చే అంశ‌మే. అయితే ఇటివ‌ల గండిపేట్ మండ‌లంలోని మూడు మున్సిపాలిటీలు సైతం ఎమ్మెల్యేను ఇరుకున ప‌డేసేలా రాజ‌కీయం మారింది.

ప్ర‌ధానంగా బండ్ల‌గూడ జాగీర్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లో టీఆర్ఎస్‌లో రెండు వ‌ర్గాలు, నార్సింగి మున్సిపాలిటీలో మూడు వ‌ర్గాలు, మ‌ణికొండ మున్సిపాలిటీల‌లో వ‌ర్గ పోరు రోజురోజుకు మితిమీరిపోతుంది. ఇది ఎమ్మెల్యే ప్ర‌కాష్‌గౌడ్‌కు క‌లిసిరాక‌ పోవ‌చ్చ‌ని అంత‌ర్గ‌తంగా వినిపిస్తుంది. ఇక చేవెళ్ల పార్ల‌మెంట్ స‌భ్యులు రంజిత్‌రెడ్డి సైతం రాజేంద్ర‌న‌గ‌ర్‌, శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల వైపుచూస్తున్నార‌ని అంత‌ర్గ‌తంగా పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్న‌ట్లు స‌మాచారం. రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ రంజిత్‌రెడ్డి వెనుక‌లా క‌లిసొచ్చే నాయ‌కులు అంత‌గా లేక‌పోవ‌డం రంజిత్‌రెడ్డికి క‌లిసి రాక‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. నాయ‌కుల నుంచి స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్ కాగా, నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది కేబినెట్ మినిస్ట‌ర్ కావాల‌ని కోరిక‌తో ఉన్న‌ట్లు తెలుస్తుంది.

బీజేపీ విష‌యానికి వ‌స్తే...

ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బీజేపీ పార్టీ బ‌లంగా పావులు క‌దుపుతుంది. రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం వైపు కూడా బీజేపీ పార్టీ గురి పెట్టింది. ఓ ప‌క్క టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల‌ను ఎదుర్కొంటేనే నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న ఎంఐఎం పార్టీని ఎదుర్కోవాలి. మ‌ణికొండ మున్సిప‌ల్ వైస్ చైర్మెన్ కే. న‌రేంద‌ర్‌రెడ్డి ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఆశీస్తున్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని వైస్ చైర్మెన్ గా అయ్యార‌ని పార్టీలో ఉన్న ఓ భావ‌న‌తో ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుందో లేదో తెలియ‌డం లేద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇది ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చేనా లేదో తెలియ‌డం లేద‌నే వాద‌నను స్థానికులు వినిపిస్తున్నాయి. గ‌తంలో బ‌ద్ధం బాల్‌రెడ్డి స్థానికుడు కాకపోవ‌డంతో స్థానికులు ఆయ‌నను గెలిపించ‌లేద‌ని స‌మాచారం. ఇక నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో చురుగ్గా లేర‌నే చ‌ర్చించుకుంటున్నారు.

మ‌ణికొండ‌, గండిపేట్ మండ‌లం దాటి శంషాబాద్‌, రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్లో కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్ అని మ‌రికొంద‌రు భావిస్తున్నారు. శంషాబాద్ మండ‌లం నుంచి బుక్క వేణుగోపాల్ సైతం పోటీలో నిలుస్తార‌నే ఊహ‌గానాలు నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా రేకెత్తుత్తున్నాయి. రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్లో ఊహించినంత స్థాయిలో ఆయ‌న‌కు ప‌ట్టు లేక‌పోవ‌డం, గ‌తంలో ఎమ్మెల్యే ప్ర‌కాష్‌గౌడ్‌కు మంచి స్నేహితుడు కావ‌డంతో టికెట్ దొర‌కొచ్చు, దొర‌కొక‌పోవునా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక మైలార్‌దేవ్‌ప‌ల్లి డివిజ‌న్ కార్పొరేట‌ర్ తోక‌ల శ్రీ‌నివాస్‌రెడ్డి సైతం బీజేపీ పార్టీ త‌ర‌పున రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం బ‌రిలో నిలిచే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌య‌త్నాల‌ను సైతం ప్రారంభించారు. గ‌తంలో ఆయ‌న స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం బ‌రిలో నిలిచారు.

అయితే ఈ సారి భార‌తీయ జ‌న‌తా పార్టీ రోజురోజుకు బ‌ల‌ప‌డుతున్న క్ర‌మంలో రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కార్పొరేట‌ర్ తోక‌ల శ్రీ‌నివాస్‌రెడ్డి బ‌రిలో ఉంటే గెలుపొంద‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. దీనికి తోడు శ్రీ‌నివాస్‌రెడ్డి నిరంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ప్ర‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం, చాక‌చ‌క్యంగా పార్టీ బ‌లోపేతానికి శ్ర‌మించ‌డం వంటి అంశాలు ఆయ‌న‌కు క‌లిసొచ్చి బీజేపీని గ‌ట్టేక్కించొచ్చు అని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా పార్టీ నాయ‌కులను క‌లుపుకొని పోవ‌డ‌మే కాకుండా ప్ర‌జ‌ల్లో సైతం మ‌మేక‌మ‌వ్వ‌డం, అంద‌రి క‌ష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీంతో తోక‌ల శ్రీ‌నివాస్‌రెడ్డి వైపు అంద‌రూ చూస్తున్నారు. పార్టీ త‌ర‌పున తోక‌ల శ్రీ‌నివాస్‌రెడ్డి పోటీ చేస్తే గెలుపొంద‌డానికి అవ‌కాశాలు ఉంటాయ‌ని స్థానికులు భావిస్తున్నారు. చూడాలి మ‌రి రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వర్గంలో కార్పొరేట‌ర్ తోక‌ల శ్రీ‌నివాస్‌రెడ్డి సార‌ధ్యంలో బీజేపీ గెలుపొందుతుందేమో.

గ‌ట్టిపోటీనిస్తున్న కాంగ్రెస్‌...

రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంతో కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి. గ‌తంలో ఉన్న కేడ‌ర్ ఇప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండ‌టం, నిరంత‌రం పార్టీ కోసం శ్ర‌మిస్తూ ఉండ‌టంతో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవ‌కాశాల‌ను సూచిస్తున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రెండు ద‌ఫాలుగా స్థానిక సీనియ‌ర్ నాయ‌కులు జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్ పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. కానీ పార్టీ నాయ‌కులంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి పోటీలో నిలబ‌డితే కాంగ్రెస్ పార్టీకి గెలుపొందే అవ‌కాశాలు ఎక్కువుగానే క‌నిపిస్తున్నాయి. ఈ మేర‌కు జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్ శ్ర‌మించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఇప్ప‌టికే కొత్త‌, పాత నాయ‌కుల‌ను అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్ త‌న‌దైన మార్క్ రాజ‌కీయం న‌డుపుతూ కాంగ్రెస్ బ‌లోపేతానికి శ్ర‌మిస్తున్నారు.

అంతేకాకుండా కాంగ్రెస్ త‌ర‌పున మ‌రో నాయ‌కులు ముంగి జైపాల్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి సిద్ధం అవుతున్న‌ట్లు వినికిడి. నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉంటూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో జైపాల్‌రెడ్డి సైతం చురుగ్గా టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డితో క‌లిసి పాల్గొంటూ క‌నిపిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా టికెట్ ద‌క్కించుకొని రాజేంద్ర‌న‌గ‌ర్ కోట‌లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని శ్ర‌మిస్తున్నాడ‌ని స్థానికులు విశ్లేషించుకుంటున్నారు. వీరిరువురు పోటీ ప‌డితే పార్టీ ఎవ‌రికి టికెట్ కేటాయిస్తుందో, పార్టీలో కుమ్ములాట‌లు ఎక్కువైతే పార్టీకి మైన‌స్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుపుతున్నారు. చూడాలి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎవ‌రు బ‌రిలో నిలిచి పార్టీని గ‌ట్టెక్కిస్తారో.

Advertisement

Next Story