బాలాపూర్​ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతం..?

by Kalyani |
బాలాపూర్​ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతం..?
X

దిశ, బడంగ్ పేట్: ​మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని బాలాపూర్​ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం కు చెందిన భూములపై కబ్జాదారుల కన్ను పడింది. వందల కోట్లు విలువ చేసే ఎండోమెంట్ కు సంబంధించిన ​భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు గత కొన్ని రోజులుగా యధేచ్చగా చెట్లు నరికివేస్తూ...చదును చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆదాయం లేని ఆలయమని ఎండోమెంట్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఆలయ భూముల్లో అక్రమంగా రేకుల షెడ్డు నిర్మిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదు మేరకు ఎండోమెంట్​ అధికారులు వాటిని కూల్చివేసి హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆలయ భూములకు సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉండగానే తిరిగి గుట్టుచప్పుడు కాకుండా ఆలయ భూముల్లో చెట్లను నరికి వేస్తున్నారు.

వివరాలలోకి వెళితే.. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని బాలాపూర్​ లో సర్వే నెంబర్​ 14,68,69,70 లోని 19.05 ఎకరాల విస్తీర్ణంలో అతి పురాతన ..ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం ఎండోమెంట్​ పరిధిలో ఉంది. ఆలయానికి ఆదాయం ఏ మాత్రం లేకపోవడంతో ఎండోమెంట్​ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో 100 కోట్లు విలువ చేసే ఆలయ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. ఒకటిన్నర సంవత్సరాల క్రితం 2 ఎకరాల ఆలయ భూమిపై కన్ను పడింది. రెండు ఎకరాల్లో చదును చేసి అప్పట్లో రేకుల షెడ్డు ను నిర్మించారు. స్థానికులు, అప్పటి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎండోమెంట్​ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎండోమెంట్​ అధికారులు అప్పట్లో రెండు ఎకరాల చుట్టూ నిర్మించిన రేకుల షెడ్​ను తొలగించారు. తిరిగి గత కొన్ని రోజులుగా ఎండోమెంట్​ భూముల్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు యధేచ్చగా పచ్చని చెట్లను గుట్టుచప్పుడు కాకుండా నరికివేసి... చదును చేస్తున్నారు. దీంతో బుధవారం స్థానికులు బాలాపూర్​ లోని వేణుగోపాల స్వామి భూములను పరిరక్షించాలని ఎండోమెంట్​ ఈఓ మురళికి ఫిర్యాదు చేశారు.

చెట్లు నరికిన ఆలయ స్థలాన్ని పరిశీలించిన మీర్​పేట్​ పోలీసులు...

బాలాపూర్​లోని వేణుగోపాలస్వామి ఆలయంలో చెట్లు నరికివేస్తున్నారని గురువారం ఆలయ ఈఓ మురళి మీర్​పేట్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్​పేట్​ పోలీసులు కేసులు నమోదు చేసుకుని, చెట్లు నరికిన ప్రాంతాన్ని మీర్​పేట్​ పోలీసులు పరిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed