తెరుచుకొని పల్లె దవాఖాన.. గ్రామీణులకు అందని వైద్యం

by Aamani |
తెరుచుకొని పల్లె దవాఖాన..  గ్రామీణులకు అందని వైద్యం
X

దిశ, శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందించాలన్న సదుద్దేశంతో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసినప్పటికీ సత్ఫలితాలు కానరావడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉప కేంద్రాల లో గతంలో ఏఎన్ఎంలు ఉండేవారు. శంకర్పల్లి మండలంలో శంకర్ పల్లి, టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జన్వాడ,మహారాజ్పేట్, కొండకల్ టంగుటూరు ఉప కేంద్రాలు ఉండేవి. ఉప కేంద్రాలుగా ఉన్న వాటిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పల్లె దవాఖానాల్లో ఏఎన్ఎం లతోపాటు రోగులకు చికిత్సలు చేసేందుకు వైద్యాధికారి హోదాలో మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (డాక్టర్ )ను ఏర్పాటు చేశారు.శంకర్పల్లి మండలంలో ఈ కేంద్రాలు ఎక్కడ కూడా సక్రమంగా పనిచేయడం లేదు.

పల్లె దవాఖానాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగులకు చికిత్స చేయాలి. గురువారం మహారాజ్ పేట గ్రామంలో 11.20గంటలకు పల్లె దవాఖానకు తాళం వేసి కనిపించింది. అక్కడ డాక్టర్( మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ) తో పాటు ఏఎన్ఎంలు ఉండాల్సి ఉండగా తాళం ఉండడం గమనార్హం. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున గ్రామాలలో అంటురోగాలు ప్రబలె అవకాశం ఉందని వైద్యాధికారులే అవగాహన కల్పిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలలోని పల్లె దవాఖానాల ద్వారా ప్రజలకు ఏదైనా జబ్బు పడితే చికిత్స చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో మంచి ఆశయంతో వాటిని ఏర్పాటు చేస్తే వాటికి తాళాలు తీసే దిక్కు లేకుండా పోతుంది. వారు సక్రమంగా హాజరవుతున్నారా లేదా అని పర్యవేక్షించాల్సిన వైద్యాధికారులు జిల్లా ఉప వైద్యాధికారి తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించడంతో ఎక్కడ పల్లె దవఖానాలు సక్రమంగా పనిచేయడం లేదు.

అంటు రోగాలు ప్రబలి వైరస్ ఫీవర్ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ తదితర వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పై నమ్మకం లేకనో ఏమో రోగం వచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులు కిక్కిరిసి వైద్యం కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పల్లె దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులపై జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహారాజ్పేట్ పల్లె దవాఖాన గురువారం తాళం వేసి ఉన్న విషయంపై టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్రీనివాస్ ను వివరణ కోరగా అక్కడ పనిచేసే మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్ సెలవులో ఉన్నారని, పల్లె దవాఖాన ఎప్పుడు తెరిచి ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Next Story