8 చెరువులు కనుమరుగు.. రంగారెడ్డి జిల్లాలో 45 చెరువులు కబ్జా

by Shiva |   ( Updated:2024-10-08 15:43:32.0  )
8 చెరువులు కనుమరుగు.. రంగారెడ్డి జిల్లాలో 45 చెరువులు కబ్జా
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: జిల్లాలో చెరువులు, కుంటలు పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నాయి. దీంతో భారీ వర్షాలు, విపత్తులు సంభవించినప్పుడు ప్రమా‌దాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే కబ్జాకు గురైన చెరువులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గ్రేటర్ హై‌దరాబాద్, ఓఆర్‌ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి.. అవి ఎలా.. ఎప్పుడు కబ్జా అయ్యాయి? అనే వివరాలను హైడ్రా బహిర్గతం చేసింది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ రింగ్‌రోడ్డులో భాగమైన రంగారెడ్డి జిల్లా పరిధిలో 45 చెరువులు కబ్జాకు గురైనట్లు తెలిపారు. ఇందులో 2014 నుంచి 2023 వరకు ఏవిధంగా చెరువులు కబ్జాకు గురయ్యాయో పూర్తిగా మ్యాప్‌లతో హైడ్రా అధికారులు బహిర్గతం చేశారు. ప్రధానంగా రం‌గారెడ్డి జిల్లాలోని గండిపేట్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, హయత్​నగర్, అబ్ధుల్లాపూర్ మెట్టు, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, బాలాపూర్ మండలాల పరిధిలోనే అత్యధిక చెరువులు కబ్జా‌లకు గురైనట్లు అధికారులు స్పష్టం చే‌శారు.

పాక్షికంగా కబ్జాకు గురైనవి 37

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పాక్షికంగా కబ్జాలైన చెరువులు రాష్ట్ర ప్రభుత్వం అవిర్బావం తర్వాత దశల వారీగా పదేండ్లలో పూర్తిగా 8 చెరువులు కనుమరుగయ్యాయి. ఆ తరువాత మరో 37 చెరువులు పాక్షికంగా కబ్జా‌కు గురైనట్లుగా 2014 గూగుల్ మ్యాప్,​2023 గూగుల్ మ్యాప్ ఆధారంగా అధికారులు గుర్తించారు. అయితే, ఈ చెరువులు కబ్జాకు గురికావడానికి గల కారణాలు, ప్రోత్సహించిన అధికారుల డాటాను సేకరించి ప్రభుత్వానికి సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాక్షికంగా కబ్జాకు గురైన 37 చెరువులు అబ్దుల్లాపూర్​మెట్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, శంషాబాద్, శేరిలింగంప‌ల్లి, రాజేంద్రనగర్, గండిపేట్ మండలాల పరిధిలోనే అధికంగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

కనుమరుగైన చెరువులు ఇవే..

రంగారెడ్డి జిల్లాలో 2014 నుంచి 2023 నాటికి పూర్తిగా కనుమరుగైన చెరువులు నాలుగు ఉన్నాయి. గండిపేట్ మండలం పుప్పాలగూడ, రాజేంద్రనగర్ మండలం బుద్వేల్, బాలాపూర్​ మండలం మామిడిపల్లిలోని మర్రివాణికుంట, అబ్దుల్లాపూర్​మెట్ మండలం కుంట్లూరు చెరువుల అనావాళ్లు కూడా లేకుండా రియల్​ వ్యాపారులు కబ్జాలు చేశారని హైడ్రా వివరాలు వెల్లడించింది. 2014 సంవత్సరంలో పాక్షికంగా కబ్జాకు గురైన నాలుగు చెరువులు ప్రస్తుతం పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడలోని బ్రాహ్మణ‌కుంట, మక్కగాని కుంట, బండ్లగూడ జాగీర్‌లోని చెరువు, నా‌ర్సింగి‌లోని కిత్తవాణికుంట చెరువులు పూర్తిగా రియల్ వ్యాపారులు కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed