జీహెచ్‌ఎంసీలోకి రంగారెడ్డిలోని 3 కార్పొరేషన్లు, 8 మున్సిపాలిటీలు

by Mahesh |
జీహెచ్‌ఎంసీలోకి రంగారెడ్డిలోని 3 కార్పొరేషన్లు, 8 మున్సిపాలిటీలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: హైదరాబాద్​ శివారులోని, రంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లను జీహెచ్​ఎంసీలో విలీనం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం మూడు నెలలుగా కసరత్తు కొనసాగించింది. అయితే ఔటర్​ రింగ్ రోడ్డు లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామాలను విలీనం చేసేందుకు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మున్సిపాలిటీలకు సైతం జలమండలి పర్యవేక్షణలోనే తాగునీటి సరఫరా కొనసాగుతున్నది. ఇదే పద్ధతిలో జీహెచ్ఎంసీ పరిపాలన విభాగం కొనసాగించాలనే ఉద్దేశంతోనే విలీన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మున్సిపాలిటీ, కార్పొరేషన్​ పరిపాలనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అనుగుణంగా పరిపాలన సాగించాలనే ఉద్దేశంతోనే జీహెచ్​ఎంసీ విలీనానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

పెరిగిన అర్బన్​ ప్రాంతాలు..

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్​, గండిపేట్​, బాలాపూర్​, హయత్ ​నగర్​, అబ్దుల్లాపూర్​మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలాల్లోని అత్యధిక ప్రాంతాలు జీహెచ్​ఎంసీ ప్రాంతానికి అంటిపెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకు జీహెచ్​ఎంసీ పరిధిలోని చంపాపేట్​ డివిజన్‌​కు మీర్‌​పేట్​, చాంద్రాయణగుట్ట, భార్కస్​ డివిజన్‌​కు బడంగ్​‌పేట్​, హయత్​ నగర్​ డివిజన్​‌కు పెద్ద​అంబర్​‌పేట్​, శేరిలింగంపల్లి డివజన్‌​కు నార్సింగ్​, మణికొండ, రాజేంద్రనగర్​లోని అత్తాపూర్​ డివిజన్‌​కు శంషాబాద్​ మున్సిపాలిటీలన్నీ కలిసి ఉంటాయి. కానీ ప్రజావసరాల కోసం ఎవరు ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు ఎదుర్కొంటున్న సందర్భాలు అనేకం. ఇలాంటి ఇబ్బందులకు తావులేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాదాపు రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలన్నీ హైదరాబాద్‌​లో విలీనమైనట్టే కనిపిస్తున్నది.

కొన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికీ సమస్యలే..

జీహెచ్ఎంసీ పరిధి పక్కనున్న కొన్ని మున్సిపాలిటీల్లోనే రెవెన్యూ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికీ మురుగునీరు, వీధి దీపాల సమస్యలున్నాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్​, మణికొండ, బండ్లగూడ జాగీర్​, శంషాబాద్ మున్సిపాలిటీల్లోనే రెవెన్యూ అవకాశం వస్తున్నట్లు సమాచారం. మీర్​‌పేట్​, జల్​పల్లి, ఆదిభట్ల, పెద్ద​ అంబర్‌​పేట్, తుర్క యంజాల్‌​ల్లో ఇప్పటికీ స్థానికంగా మౌలిక సదుపాయాల సమస్యలున్నాయి. ఆదాయం లేకపోవడంతో సమస్యల పరిష్కారం కాలేకపోతున్నట్లు తెలుస్తున్నది.

విలీనమయ్యే మున్సిపాలిటీలు ఇవే..

రంగారెడ్డి జిల్లాలో 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే 12 మున్సిపాలిటీల్లో అమనగల్లు, ఇబ్రహీంపట్నం, శంకర్​పల్లి, షాద్​‌నగర్​ మున్సిపాలిటీలు ఔటర్​ రింగ్​ రోడ్డు బయట ఉండడం తో విలీనం చేసే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఔటర్​ రింగ్​ రోడ్డును హద్దుగా చేసుకొని మున్సిపాలిటీలను జీహెచ్​ఎంసీలో విలీనం చేయాలని భావిస్తోంది. కనుక రంగారెడ్డి జిల్లాలోని మూడు కార్పొరేషన్లు బడంగ్‌​పేట్​, మీర్​పేట్​, బండ్లగూడ జాగీర్​, 8 మున్సిపాలిటీలైన ఆదిభట్ల, జల్​పల్లి, మణికొండ, నార్సింగ్​, పెద్ద అంబర్​‌పేట్​, శంషాబాద్, తుర్కయంజాల్​, తుక్కుగూడలను మాత్రమే జీహెచ్​ఎంసీలో విలీనం చేయనున్నట్లు సమాచారం.

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న విలీన బిల్లు..

రాష్ట్ర ప్రభుత్వం ఔటర్​ రింగ్​ రోడ్డు లోపలున్న మున్సిపాలిటీలను జీహెచ్​ఎంసీలో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది. గురువారం శాసనసభలో, శుక్రవారం శాసన మండలిలో శివారు మున్సిపాలిటీల విలీన బిల్లుపై చర్చ సాగనున్నది.

Advertisement

Next Story