దామగుండం రాడార్ స్టేషన్ దేశం గర్విచదగ ప్రాజెక్ట్: రాజ్‌నాథ్ సింగ్

by karthikeya |   ( Updated:2024-10-15 09:31:53.0  )
దామగుండం రాడార్ స్టేషన్ దేశం గర్విచదగ ప్రాజెక్ట్: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దామగుండంలో ఏర్పాటు చేయబోతున్న లో-ఫ్రీక్వెన్సీ నేవలర్ రాడార్ సెంటర్ ఏర్పాటు చేస్తుండడం దేశం గర్విచదగ్గ విషయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ దేశ సైన్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తాను బలంగా నమ్ముతున్నానని, ఇది దేశ భద్రతను మరింత పెంచుతుందని పేర్కొన్నారు. రాడార్ స్టేషన్ శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే దేశ రక్షణ రంగంలో నేవీ రాడార్‌ది కీలక పాత్ర అని, అలాంటి నేవీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ రాడార్ వ్యవస్థ త్రివిధ దళాలకు చుక్కానిలా పనిచేస్తుందన్నారు.

అనంతరం ఈ ప్రాజెక్ట్‌కు అడగగానే అనుమతులిచ్చి భూ కేటాయింపులు చేసినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి ఉపయోగపడే కార్యాన్ని చేయకుండా ఉండడం రాజకీయం అనిపించుకోదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభినందనీయమన్న రాజ్‌నాథ్ సింగ్.. రాజకీయం అంటే అధికారం దక్కించుకోవడానికి కాదు.. దేశాన్ని నిర్మించడమని తాను నమ్ముతానని, బహుశా సీఎం రేవంత్ రెడ్డిలో కూడా అలాంటి భావనలే ఉన్న వ్యక్తి కావడం వల్లే మనస్ఫూర్తిగా ఈ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు సహకరించారని కొనియాడారు.

అదే విధంగా భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాంని కూడా రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి అబ్దుల్ కలాం అని, ఆయన జన్మదినం సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మన దేశానికి అబ్దుల్ కలాం లాంటి మహోన్నత వ్యక్తులే స్ఫూర్తి అని, వారి అడుగుజాడల్లోనే దేశం ముందుకెళుతోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఇక కమ్యూనికేషన్ రంగంలో టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతోందన్న రాజ్‌నాథ్ సింగ్.. సాంకేతిక యుగంలో టెక్నాలజీ అనేక రకాలుగా ఉపయోగపడుతోందని, సమాచార విప్లవం అనేక దేశాలను దగ్గర చేస్తోందని అన్నారు. అయితే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే కీలక సమయంలో ఇబ్బందులు వస్తాయని, ముఖ్యంగా సముద్ర గర్భ ఖనిజాలపై అనేక దేశాలు కన్నేశాయని, ఆ దేశాలను నియంత్రించాలంటే బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ముఖ్యమని చెప్పారు. మన దగ్గర మల్కా నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వరకు బలమైన నౌకాదళం ఉందని, అలాంటి నౌకాదళానికి బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ తోడైతే మన సముద్ర జలాలను రక్షించుకోగలుగుతామని, అందుకోసం ఈ నేవల్ రాడార్ స్టేషన్ ఎంతగానే ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

👉Also Read: దామగుండం నేవీరాడార్ స్టేషన్ పై అపోహలు వద్దు : సీఎం రేవంత్ రెడ్డి

Next Story

Most Viewed