టీఎస్సీఎస్పీ పేపర్ లీకేజీలో ఆయనదే కీలక పాత్ర.. డైరీని స్వాధీనం చేసుకున్న సిట్

by Vinod kumar |
టీఎస్సీఎస్పీ పేపర్ లీకేజీలో ఆయనదే కీలక పాత్ర.. డైరీని స్వాధీనం చేసుకున్న సిట్
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్సీఎస్పీ పరీక్షల ప్రశ్నాపత్రాల కేసులో విచారణ కొనసాగిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. బోర్డులో ఔట్​సోర్సింగ్​ఉద్యోగిగా పని చేస్తున్న రాజశేఖర్​రెడ్డిది ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర అని తాజాగా సిట్​విచారణలో వెల్లడైంది. మూడేళ్లుగా బోర్డులోని కంప్యూటర్లను తన నియంత్రణలో ఉంచుకున్న రాజశేఖర్​రెడ్డి ప్రశ్నాపత్రాలను లీక్​చేసి బోర్డు పర్మినెంట్​ఉద్యోగి అయిన ప్రవీణ్​ద్వారా బయటకు లీక్​చేసినట్టుగా తేలింది. దాంతోపాటు తనకు తెలిసిన కొందరికి ప్రశ్నాపత్రాలను అందించినట్టుగా నిర్ధారణ అయ్యింది.

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న టీఎస్సీఎస్పీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి రాజకీయ రంగు కూడా పులుముకోవటంతో సిట్​అధికారులు తమ కస్టడీలో ఉన్న నిందితులను అన్ని కోణాల్లో క్షుణ్నంగా విచారిస్తున్నారు. శనివారం ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డిలను బోర్డు ఆఫీస్ కు తీసుకెళ్లిన సిట్​అధికారులు అక్కడ సీన్​రీకన్​స్ర్టక్షన్​చేయటంతోపాటు రెండు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆదివారం సిట్​ఇన్​ఛార్జ్​గా ఉన్న అదనపు పోలీస్​కమిషనర్​(క్రైమ్స్) ఏ.,ఆర్.శ్రీనివాస్, ఇతర అధికారులు హిమాయత్​నగర్​లోని సిట్​కార్యాలయంలో నిందితులను సుధీర్ఘంగా ప్రశ్నించారు.

ఈ విచారణలో 2017లో ఔట్​సోర్సింగ్​ఉద్యోగిగా చేరిన రాజశేఖర్​రెడ్డి బోర్డులోని నిర్వహణా లోపాలను అవకాశంగా చేసుకుని మూడు సంవత్సరాలుగా కంప్యూటర్లను తన ఆధీనంలో పెట్టుకున్నట్టుగా వెల్లడైందని సమాచారం. ప్రవీణ్​నుంచి కాన్ఫిదెన్షియల్​రూం ఇంఛార్జీగా ఉన్న శంకర్​లక్ష్మి డైరీ నుంచి కంప్యూటర్లకు సంబంధించిన పాస్​వర్డులను రాజశేఖర్​రెడ్డి సేకరించినట్టుగా తేలింది. ఆ తరువాత ఆయా కంప్యూటర్ల ఐపీ అడ్రసులను మార్చిన రాజశేఖర్​రెడ్డి వాటిని పూర్తిగా తన కంట్రోల్​లోకి తెచ్చుకున్నాడు.

అందరూ వెళ్లిపోయాక..

ఇలా కంప్యూటర్లను తన ఆధీనంలోకి తెచ్చుకున్న రాజశేఖర్​రెడ్డి టీఎస్సీఎస్పీ బోర్డు ఉద్యోగులు అందరూ విధులు ముగించుకుని వెళ్లిపోయిన తరువాత తన చేతివాటాన్ని ప్రదర్శించినట్టుగా సిట్​ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. అతనితోపాటు ప్రవీణ్​కూడా ఆఫీస్​సమయం ముగిసిన తరువాత బోర్డు కార్యాలయంలోనే ఉండి ప్రశ్నాపత్రాల లీకేజీలో పాత్ర వహించినట్టుగా తేలింది. రాజశేఖర్​రెడ్డి ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్​ల్లోకి డౌన్​లోడ్​చేస్తే ప్రవీణ్​వాటిని తనకు పరిచయం ఉన్న రేణుకకు అందచేసినట్టుగా వెల్లడైంది. రేణుక తన భర్త, సోదరుని ద్వారా వీటిని ఇతర వ్యక్తులకు ఆ ప్రశ్నాపత్రాలను విక్రయించినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే గడిచిన మూడేళ్లలో రాజశేఖర్​రెడ్డి, ప్రవీణ్​కలిసి ఎన్ని ప్రశ్నాపత్రాలు లీక్​చేశారు?..వాటిని ఎవరికి అందచేశారు?..ఎంతమందికి అమ్మారు? అన్న కోణాల్లో సిట్​అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

రాజశేఖర్ రెడ్డి​ స్నేహితులపై ఆరా..

ఇక, రాజశేఖర్​రెడ్డి స్నేహితులపై కూడా సిట్​అధికారులు దృష్టిని సారించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం పరిసరాల్లోని దాదాపు వందమంది టీఎస్సీఎస్పీ బోర్డు నిర్వహించిన వేర్వేరు పరీక్షల్లో గణనీయంగా మార్కులు సాధించినట్టుగా ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈ దిశలో కూడా సిట్​అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజశేఖర్​రెడ్డికి మంత్రి కేటీఆర్​పీఏ తిరుపతితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసే ప్రశ్నాపత్రాలను లీక్​చేశారని రేవంత్​రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు జరిగింది ఏందన్నది నిర్ధారించుకోవటానికి రాజశేఖర్​రెడ్డి స్నేహితులను కూడా సిట్​అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే రాజశేఖర్​రెడ్డి నుంచి ఓ డైరీని స్వాధీనం చేసుకున్న అధికారులు గడిచిన మూడేళ్లలో అతని బ్యాంక్​అకౌంట్ల లావాదేవీలను కూడా తనిఖీ చేస్తున్నారు. దర్యాప్తుపై సిట్​అధికారులతో మాట్లాడగా త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో రాజశేఖర్​రెడ్డి కంప్యూటర్లను తన నియంత్రణలో పెట్టుకుని లీకేజీ వ్యవహారాన్ని నడిపినట్టుగా వెల్లడైందన్నారు. సీజ్​చేసిన నిందితుల మొబైల్​ఫోన్లు, కంప్యూటర్లకు సంబంధించిన ఫోరెన్సిక్​నివేదికలు మరో నాలుగైదు రోజుల్లో చేతికి అందనున్నట్టు చెప్పారు. ఈ వివరాలు అందితే కేసులో కీలకమైన వివరాలు వెలుగు చూస్తాయని తెలిపారు.

Advertisement

Next Story