Rain Alert: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు

by Shiva |   ( Updated:2024-07-25 03:59:18.0  )
Rain Alert: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని స్తభింపజేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ముసురు ఏకధాటిగా పడుతుండటంతో పలు జిల్లాల్లో చెరువు అలుగు పోస్తున్నాయి. అదేవిధంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు బ్యారేజీల్లోకి వదర ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం కీలక సూచన చేసింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో ఉరుములు, మెరుపుల‌తో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే ఆ జిల్లాలకు అధికారులు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉండటంతో ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జరీ చేసింది. ముఖ్యంగా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisement

Next Story