రాబోయే ఎన్నికల్లో రైల్వే ఓటర్లు కీలకం

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-17 03:22:38.0  )
రాబోయే ఎన్నికల్లో రైల్వే ఓటర్లు కీలకం
X

దిశ, మెట్టుగూడ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా రైల్వే ప్రాంతాలు ఉన్నాయి. ఈ సంస్థకు చెందిన ప్రాంగణాలు సుమారు నలభై శాతం వరకు ఉండగా వాటిలో పనిచేసే ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ సికింద్రాబాద్ నియోజకవర్గంలో చాలా అధికంగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రైల్వే ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది కీలకంగా మారింది. రైల్వే ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రతి పార్టీ ప్రతి అభ్యర్థి ప్రయత్నిస్తారు. సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం, సంచాలన్ భవన్, హైదరాబాద్ భవన్, లేఖ భవన్, లాలాగుడా వర్క్ షాప్, లోకో షేడ్, రైల్వే ఆసుపత్రి, రైల్వే స్కూల్స్, రైల్వే ఇంటర్ డిగ్రీ కాలేజీలు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, రైల్వే ఆఫీసర్స్ క్లబ్, రైల్వే స్పోర్ట్స్ క్లబ్, ఇరిసెట్ లాంటి చిన్నాచితకా ఆఫీసులు చాలా ఉన్నాయి.

నియోజకవర్గములోని చిలలాగుడా, సీతాఫల్ మండి, హమాల్ బస్తి, మెట్టుగూడ, లాలాగూడ, నార్త్ లాలాగుడా, తుకారం గేట్, శాంతి నగర్ లాంటి ప్రాంతాలలో రైల్వే ఉద్యోగులు రైల్వే క్వార్టర్స్‌లలో ఉంటున్నారు. వ్యక్తిగత నివాసాలు ఉన్నవారు కూడా నియోజకవర్గంలో చాలా ఉన్నారు, ఒక్క మెట్టుగూడ డివిజన్ లో 60 శాతం వరకు రైల్వే ఉద్యోగులు ఉన్నారు. రైల్వే క్వాటర్లు, కాలనీలు, బస్తీల్లో ఉండే ఉద్యోగులు, కార్మికులంతా స్థానిక పార్టీలతో సంబంధాలు ఉన్నకూడా రైల్వే కార్మిక సంఘాలు చెప్పిన పార్టీవైపే ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం ఉంది.

ఇక్కడ రైల్వే కార్మిక సంఘాలదే కీలక నిర్ణయం. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్, ఇవిగాకుండా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇంజినీరింగ్, రైల్వే తెలంగాణ జాక్, పదవి విరమణ, పింఛన్ల అసోసియేషన్ ఇలా అనేక సంఘాలున్నాయి. వీటిలో ప్రతీ సంఘానికి ప్రాధాన్యం ఉంది. ప్రధాన సంఘాలకు ఇందులో కొన్ని అనుసంధానంగా ఉన్నాయి. అయినా ఎంప్లాయీస్ సంఘ్, మాజ్దూర్ యూనియన్ సంఘాలే కీలకం.

వీటిలో ఎంప్లాయీస్ సంఘ్ మొదటి నుంచి ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఉన్న కారణంగా జాతీయ పార్టీకే మద్దతు కొనసాగుతున్న సంఘంగా ప్రాచుర్యం పొందింది. ఈ సంఘం ప్రధానంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆ పార్టీకి తీవ్రంగా మద్దతిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేస్తుంది. మాజ్దూర్ యూనియన్ ఎన్నికల సందర్భంలో పరిస్థితులకు అనుకూలంగా ఏ పార్టీకి పనిచేయాలనేది సమష్టిగా నిర్ణయించుకుంటారు. తాజాగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో రైల్వేకు సంబంధించిన ఓటర్లు 35,000 లకు పైగా ఉన్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీలకు మద్దతునిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.


ఇవి కూడా చదవండి:

అత్యంత కీలకం కాబోతున్న సర్పంచ్ ఓట్లు.. బీఆర్ఎస్‌లో మొదలైన గుబులు!

Advertisement

Next Story