రాహుల్ అనర్హత అంశం : 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల స్కెచ్ ఇదేనా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-25 08:40:44.0  )
రాహుల్ అనర్హత అంశం : 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల స్కెచ్ ఇదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో ఎడమొహం పెడమొహంలా ఉన్న ప్రతిపక్షాలు రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశంతో ఒక్కటి కానున్నాయా? బీజేపీ టార్గెట్‌గా జంగ్ సైరన్ మోగించనున్నాయా? మోడీ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమైతే 2024లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి వరకు ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను అంగీకరించని ప్రతిపక్షాలు ఒక్క సారిగా డిస్ క్వాలిఫై అంశంతో ఏకమవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ లేకుండానే కూటమి కడతామని ప్రకటించిన పార్టీలన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌కు బాసటగా నిలుస్తుండటంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ గొడుగు కిందకు ప్రతిపక్షాలు చేరి ఉమ్మడి పోరు చేయనున్నాయా అనే అంశం తాజాగా చర్చకు వస్తోంది.

ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షంలోని కీలక వ్యక్తిపై ఈ వేటును ప్రజాస్వామ్యంపై దాడిగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. రాహుల్ గాంధీపై దాడిని తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా దేశంలోని ఇతర పార్టీల నేతలు సైతం ఖండించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి ఈ తాజా అంశం దోహదపడుతుందని తద్వారా 2024లో మోడీ దూకుడుకి షాక్ ఇవ్వాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

ప్రతిపక్షాల చేతికి పదునైన ఆయుధంలా..

ఇప్పటికే ప్రతిపక్షాలు ఈడీ దాడులపై ఉమ్మడిగా సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆ పార్టీలన్నింటికి తాజా అంశం పదునైన ఆయుధం కానుందనడంలో సందేహం లేదు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీని ఎలాగైనా ఈ సారి దెబ్బ కొట్టాలని అపోజిషన్ పార్టీలు భావిస్తున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వల్ల ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. త్వరలో ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని వారంటున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలన్నింటిని బీజేపీ ఏకం చేసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం అయ్యేందుకు రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం కలిసి వస్తోందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. రాజకీయ దృష్టితోనే ఆఘమేఘాల మీద అనర్హత వేటు పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా ఈ అంశం మాత్రం ఒక్క సారిగా రాజకీయ వేడి రాజేసింది.

కాంగ్రెస్‌లో ఐక్యతా రాగం వినిపించనుందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంతో పార్టీ నేతలంతా ఒక తాటిపైకి వచ్చి పోరాడే ఛాన్స్ ఉండటంతో కాంగ్రెస్‌కు తాజా అంశం ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం దీని ఎఫెక్ట్ ఉండబోతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ వ్యవహారం మాత్రం ఇటు తెలంగాణలో అటు కేంద్రంలో బీజేపీకి బిగ్ మైనస్ కానుందని పొలిటికల్ ఎనలిస్టులు భావిస్తున్నారు.

కాగా మమతా బెనర్జీ అనర్హత వేటుకు ముందు రాహుల్ గాంధీని బీజేపీ కావాలనే హీరోని చేస్తోందని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీని వాడుకుని కాంగ్రేసేత ప్రతిపక్షాల ఐకమత్యాన్ని దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తోందని ఆమె కామెంట్ చేశారు. పొలిటికల్ గేమ్‌లో మాత్రం ఈ అంశం కాంగ్రెస్‌కే ప్లస్ పాయింట్ అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ వేటు అంశం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా జరిగే రానున్న ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపనుందనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Advertisement

Next Story

Most Viewed